● రైతు సంఘం నేతల డిమాండ్
● పలు గ్రామాల్లో ఎండిపోయిన పంటల పరిశీలన
అనంతగిరి: వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వికారాబాద్ మండల పరిధిలోని పీరంపల్లి, పులుసుమామిడి, సిద్ధులూరు గ్రామాల్లో పర్యటించిన జిల్లా బృందం, పంట నష్టాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం, బోర్లలో నీటి కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పత్తి, వరి, కంది పంటలతో పాటు క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ తదితర కూరగాయల పంటలు, పూల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పందించి వెంటనే వికారాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇందురూపాటి గోపాల్‌రెడ్డి, తేజ, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


