అడిగిన వెంటనే ..
సమన్వయంతో అభివృద్ధి
ఫ్యూచర్‌సిటీకి భూములు ఇచ్చిన గ్రామాల ప్రజలకు కళ్ల ముందే బంగారు భవిష్యత్తు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనం దండిగా నిధులు మంజూరు కావడమే.. అడిగిందే తడవుగా ప్రతిపాదనలు పంపిన వెంటనే టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, ఎస్‌డీఎఫ్, సీఆర్‌ఆర్ కింద నిధులు విడుదల అవుతున్నాయి. వాటితో అభివృద్ధి పనులు సాగుతున్నాయి.
యాచారం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి యాచారం మండల పరిధి 24 పంచాయతీలను ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రా మాల్లో అత్యధికంగా 9 వేల ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అదే భూముల్లో సింహభాగం కంపెనీలను ఏర్పా టుకు నిర్ణయించింది. తాజాగా ఫ్యూచర్‌సిటీ కోసం మొండిగౌరెల్లి, కొత్తపల్లిలో రెండు వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని సేకరించడానికి సిద్ధపడింది.
రెండేళ్ల కాలంలో..
గత ఫార్మాసిటీ, తాజాగా ఫ్యూచర్‌సిటీకి భూములు సేకరించే గ్రామాల్లోని రైతులు, ప్రజల నుంచి వ్యతిరేకత రాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట నిధులు కేటాయిస్తోంది. 24 గ్రామాల్లో రూ.76.93 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతోంది. భూముల సేకరణలో కీలకమైన టీజీఐఐసీ.. నిధులు మంజూరు చేస్తోంది. తర్వాత హెచ్‌ఎండీఏ, ఎస్‌డీఎఫ్, సీఆర్‌ఆర్ గ్రాంట్స్ నుంచి నిధులు మంజూరవుతున్నాయి. వాటితో సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నారు. గతంలో పైసా నిధుల్లేక విలవిల్లాడిన మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి, మాల్, యాచారం, మల్కీజ్‌గూడ, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్ తదితర గ్రామాలు నేడు.. సీసీరోడ్లతో తళతళలాడుతున్నాయి.
మరో రూ.25 కోట్లు
ఫ్యూచర్‌సిటీ కోసం త్వరలో చింతుల్ల, యాచారం, నల్లవెల్లి గ్రామాల్లో అసైన్డ్ భూములు సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజల్లో వ్యతిరేకత రాకూడదనే ముందస్తు ఆలోచనతో.. సర్పంచులు అడిగిన ప్రతి అభివృద్ధి పనికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆయా పంచాయతీ రాజ్, టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. రూ.25 కోట్లకు పైగా నిధులతో మీర్‌ఖాన్‌పేట నుంచి నక్కర్తమేడిపల్లి వరకు 12 కిలో మీటర్లు, గతంలో మంజూరైన రూ.72 కోట్ల నిధులతో పాటు అదనంగా కావాల్సిన నిధులు మంజూరు చేసి యాచారం నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 12 కిలోమీటర్ల మెర డబుల్ రోడ్డు నిర్మాణానాకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. రెండున్నర కోట్లకు పైగా నిధులతో నల్లవెల్లి– మంతన్‌గౌరెల్లి బైపాస్ రోడ్డు, మంచాల మండల పరిధి దాద్‌పల్లి నుంచి మాల్ వరకు బీటీరోడ్లను నిర్మించడానికి రూ.నాలుగు కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. మరోసారి మొండిగౌరెల్లి– చింతపట్ల, చౌదర్‌పల్లి– నందివనపర్తి తదితర గ్రామాల్లో లింకు రోడ్లను బీటీరోడ్లుగా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల కాలంలో రూ.76.93 కోట్లు
మరో రూ.25 కోట్లకు ప్రతిపాదనలు
శరవేగంగా అభివృద్ధి పనులు
యాచారం మండలానికి మహర్దశ
సుమారు రూ.5 కోట్లతో సీసీరోడ్లు, మరో రూ.2 కోట్లకు పైగా నిధులతో అండర్ డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నాం. అడిగిన వెంటనే నిధులు మంజూరు అవుతున్నాయి. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– అనితశరణం, సర్పంచ్, యాచారం
యాచారం మండలానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పటికే రూ.వంద కోట్లకు పైగా నిధులతో పరిధి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
– మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం


