ఇబ్రాహీంపట్నం రూరల్: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని అదనపు కలెక్టర్ కిరణ్మయి స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు పాఠశాలల్లో బోధన ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు ప్రతిరోజు తప్పనిసరి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేయని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల్లో హాజరు శాతాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల హాజరు, ప్రగతిని నిరంతరం సమీక్షించి వెనుకబడిన పాఠశాలలపై దృష్టి సారించాలన్నారు. అసెస్‌మెంట్ ఫలితాల ఆధారంగా బోధన మెరుగుపర్చాలన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
రంగారెడ్డి అదనపు కలెక్టర్ కిరణ్మయి


