తాండూరు టౌన్: ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ నాయకులు వీక్షించారు. మన్‌కీ బాత్ జిల్లా కన్వీనర్ బంటారం భద్రేశ్వర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశం సుభిక్షంగా వర్ధిల్లుతోందన్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను మార్చి ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరుస్తున్న ఘనత ప్రధానికే దక్కుతుందన్నారు. ప్రజాసంక్షేమం లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు బాలేశ్వర్ గుప్తా, శాంత్ కుమార్, కృష్ణ ముదిరాజ్, మల్లేశం, పటేల్ విజయ్, శ్రీకాంత్, రాజు, కృష్ణ, నరేందర్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: మండల పరిధిలోని పెద్దనందిగామలో ఆదివారం సోలార్ విద్యుత్ దీపాలను అమర్చారు. యునైటెడ్ వే సహకారంతో వీధుల్లో సోలార్ లైట్లు అమర్చినట్లు సర్పంచ్ చన్‌బస్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు సంజీవరెడ్డికి ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు హెచ్ నరేందర్‌రెడ్డి, ఎండీ ఆరిఫ్, లింగం చంద్రప్ప, చన్యానాయక్, కురువ బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఆదివారం నిర్వహించిన నేషనల్ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో కొడంగల్ మండల విద్యార్థులు ప్రతిభ చాటారు. గోల్డ్, సిల్వర్, బ్రౌన్ మెడల్స్‌తోపాటు సర్టిఫికెట్లను సొంతం చేసుకున్నారు. రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు విజ్ఞత, మహేశ్వరి, తైసీన్, నందిని గోల్డ్ మెడల్స్ సాధించాగా.. లక్ష్మి, దివ్య సిల్వర్ మెడల్స్, లక్ష్మి, సింధూజ బ్రౌన్ మెడల్స్ సాధిచారని కరాటే మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం
టీఆర్‌పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
దుద్యాల్: బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు టీఆర్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం మండలంలోని హస్నాబాద్, దుద్యాల్ గేటు మీదుగా పాదయాత్ర సాగింది. హస్నాబాద్ శివారులో కాసేపు రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలు ఏకమైనప్పుడే న్యాయం జరుగుతుందని తెలిపారు. కొడంగల్‌లో ప్రారంభమైన పాదయాత్ర దుద్యాల్ మండల మీదుగా నారాయణపేట జిల్లా కోస్గికి చేరుకుంది.
మొయినాబాద్‌రూరల్: మహిళలు చదవడం, రాయడం నేర్చుకున్నప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు అశ్వినిభరత్, అమ్డాపూర్ సర్పంచ్ కృష్ణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామంలో ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల పరిశీలనకు హాజరైన వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జితేందర్‌రెడ్డి, మహిళా సమాఖ్య సభ్యులు, వీఓఏ సునీత, కావ్య, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.


