అనంతగిరి: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (హెచ్ 143)రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమ భావజాలంతో ఏర్పడిన టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమం కోసమే పని చేసిందని గుర్తు చేశారు. ఏ రోజు ఏ రాజకీయ పార్టీతో సన్నిహితంగా లేదన్నారు. తాము ఎప్పటికీ జర్నలిస్టులకు మాత్రమే సన్నిహితులమని పేర్కొన్నారు. తాను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే జర్నలిస్టుల నిధికి రూ.42 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆ నిధుల నుంచి కరోనా సమయంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షలు, సాధారణ మరణం పొందిన వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం చేశామన్నారు. ఐదేళ్లపాటు నెలకు రూ.3 వేల పెన్షన్ ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ప్రహ్లాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, వికారాబాద్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద పటేల్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చంద్రప్రియ, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, బీఆర్‌ఎస్ నాయకుడు చైతన్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ


