షాద్‌నగర్: వాడవాడలా గణనాథులను ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన వేడుకల్లో చిన్నచిన్న తప్పిదాలతో పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సంబురాలు వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలి. గణనాథులకు వీడ్కోలు పలికేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. శంషాబాద్ పరిధిలోని పాల్మాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిమజ్జన వేడుకకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
చెరువులు, కుంటల వద్ద
తీసుకోవాల్సిన చర్యలు
గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చెరువుల వద్ద అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అధిక సంఖ్యలో చెరువుల వద్దకు వెళ్తుంటారు కాబట్టి భద్రత కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి. నిమజ్జనం చేసే ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి ప్రమాదకర ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
● చెరువులు, కుంటల వద్ద పోలీసు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలి.
● గజ ఈతగాళ్లను, రెస్క్యూ బృందాలను నియమించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలి.
● లైఫ్ జాకెట్లు, రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలి.
● లోతైన నీటిలోకి ఎవరూ వెళ్లకుండా చూడాలి.
● పిల్లలను చెరువులు, కుంటల వద్దకు ఒంటరిగా వెళ్లనీయొద్దు.
● క్రేన్లతో భారీ విగ్రహాలను నిమజ్జనం చేస్తే నిపుణులు పర్యవేక్షించాలి.
● విద్యుత్ తీగలు, జనరేటర్లు, విద్యుత్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
● చెరువులు, కుంటల వద్దకు వెళ్లే మార్గాల్లో గుంతలు ఉంటే మరమ్మతులు చేపట్టాలి.
● రహదారి పక్కన ముళ్ల చెట్లు ఉంటే తొలగించాలి.
● ప్రథమ చికిత్స కేంద్రం, అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలి.
● చెరువుల పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి.
● పూజా సామగ్రి, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను నీటిలో వేయకుండా ప్రత్యేక సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
● నిమజ్జన ప్రాంతంలో తగినంత వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్లు, ఏర్పాటు చేయాలి.
● చెరువుల్లో నీరు తక్కువగా ఉన్నప్పుడు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రజలు లోపలికి దిగకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.
గణనాథుల ఊరేగింపులో జాగ్రత్తలు ఇవే..
● ఊరేగింపు సమయంలో వాహనాల్లో చిన్నారులు, పిల్లలను ఎక్కించొద్దు,.
● విద్యుత్ తీగలు విగ్రహాలకు తాగి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఊరేగింపులో మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
● ట్రాఫిక్ రద్దీ విషయంలో అప్రమత్తత అవసరం.
● నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. టపాసులు కాల్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అక్కడికి వచ్చిన వారిపై పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
● నిమజ్జనం తర్వాత మద్యం మత్తులో వాహనాలు నడిపిస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనవద్దు.
రంగులతో కళ్లకు ఇబ్బంది
నిమజ్జన సమయంలో యువత పెద్ద ఎత్తున రంగులు చల్లుకుంటారు. ప్రమాదకర రసాయనాలతో చేసిన రంగులు చల్లుకోవడంతో కళ్లకు ప్రమాదం పొంచి ఉంది. రంగులు పడక చాలామంది శరీరం దురదకు గురవుతుంది. సంప్రదాయ రంగులను వాడుకోవడం మంచిది.
డీజే ఎంతో డేంజర్
ఊరేగింపులో ఎక్కువ సమయం డీజే పెట్టాల్సి రావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. డీజే శబ్దం వినగానే ఊపు వస్తుంది. నిర్వాహకులకు వినసొంపుగా ఉన్నా.. వినే వారికి మాత్రం డేంజర్ అది. ఒక్కోసారి అది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది. అధిక పవర్ ఉన్న డీజే బాక్సుల ద్వార 90 నుంచి 140 డెసిబుల్స్ శబ్దం వస్తుంది. 75 డెసిబుల్స్‌కు మించకుండా చూసుకోవడం మంచిది. డీజేలు ఉపయోగించి నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలుకుదాం
నిమజ్జనం వేళ జాగ్రత్తలు తీసుకోవాలి
అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి
అప్రమత్తతే శ్రీరామరక్ష


