తరచూ ట్రిప్పవుతున్న ఫీడర్లు నిలిచిపోతున్న సరఫరా ఎండిపోతున్న పొలాలు సబ్‌స్టేషన్ల ఎదుట రైతుల ఆందోళనలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కరెంట్ కోతలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. కంటికి రెప్పలా కాపాడుకున్న వరిపైరు కళ్ల ముందే ఎండి పోతుండటంతో తట్టుకోలేక సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా శనివారం మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో యాచారం విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎల్‌నినో కారణంగా ఇప్పటికే సాగు విస్తీర్ణం సగానికిపైగా తగ్గింది. దీనికి తోడు సరఫరాలో హెచ్చుతగ్గులతో మోటార్లు కాలిపోతున్నాయి. తాజా అప్రకటిత విద్యుత్ కోతలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఒత్తిడిలో సబ్‌స్టేషన్లు, ఫీడర్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 65 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు సగటున 85 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదవుతోంది. 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 45 నుంచి 46 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగం రికార్డు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదు అవుతుండటంతో సబ్‌స్టేషన్లలోని ఫీడర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి, తరచూ ట్రిప్పవుతున్నాయి. వ్యవసాయ మోటార్లు కాలిపోతుండడంతో మరమ్మతుల కోసం రైతులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. కనీసం 12 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ స్థానిక సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు.
ఎండిపోతున్న పంటలు..
జిల్లాలో 5.6 లక్షల ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు అంచనా. ఇందులో 1.62 లక్షల ఎకరాల్లో వరి, 1.94 లక్షల ఎకరాల్లో పత్తి, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగవుతున్నాయి. ఎల్‌నినో కారణంగా చెరువులు, కుంటలన్నీ వట్టిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయయాయి. దీనికి తో డు కరెంట్ కోతలు మొదల వడంతో యాచారం, మంచాల, మాడ్గుల, తలకొండపల్లి, నందిగామ, ఫరూ ఖ్‌నగర్, చేవెళ్ల మండలాల్లో వరిపొలాలు ఎండిపోతున్నాయి. ఏపుగా పెరిగిన పంట కళ్లముందే వాడిపోతుండటంతో రైతులు తట్టుకోలేక పోతున్నారు.
ఓవర్ లోడులో సబ్‌స్టేషన్లు
సర్కిళ్ల వారీగా విద్యుత్ డిమాండ్ (మెగావాట్లలో..)
తేదీ సైబర్‌సిటీ రాజేంద్రనగర్ సరూర్‌నగర్
11 736 698 360
12 653 672 345
13 632 545 278
14 590 607 322
15 678 634 312
16 747 674 338
17 778 694 348
18 764 702 344


