కొడంగల్: మున్సిపల్ పరిధిలో మెజారిటీ ప్రజలకు శ్మశాన వాటికలు లేవు. 2003లో అప్పటి ఎంపీ జితేందర్‌రెడ్డి నిధులతో పట్టణ శివారులో నిర్మించిన దహన వాటిక ఒక్కటే అందుబాటులో ఉంది. సమాజంలో కొన్ని కులాలకు చెందిన వారు మాత్రమే పార్థివ దేహాలను దహనం చేస్తారు. మెజారిటీ వర్గాల్లో చనిపోయిన వారిని ఖననం చేస్తారు. ఇలా రెండు రకాలుగా ఆఖరి మజిలీని ముగిస్తారు. కొడంగల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత వైకుంఠ దామాలను నిర్మించలేదు. కొడంగల్‌లో సుమారు 14వేలకు పైగా జనాభా ఉంది. ఇందులో హిందువులు, ముస్లింలు ఎవరి మతం ప్రకారం వారు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ముస్లిం మతస్తులకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో శ్మశాన వాటికలు ఉన్నాయి. గతంలో కొడంగల్ పట్టణం నిజాం పాలనలో ఉన్నప్పుడు ముస్లింలకు అనేక ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారు. నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మెజారిటీ వర్గీయులకు శ్మశాన వాటికలు కేటాయించడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో చివరి మజిలీ కోసం తిప్పలు తప్పడం లేదు. పట్టణ శివారులో కొన్ని చోట్ల అనధికారికంగా శవాలను ఖననం చేస్తున్నారు. ఆరడుగుల స్థలం కోసం అవస్థలు పడుతున్నారు.
పొలం ఉంటే సరి
పట్టణంలోని కొందరు కుటుంబ సభ్యులు చనిపోతే వారి పొలంలో ఖననం చేస్తున్నారు. పొలం, భూములు లేనివారి పరిస్థితి దయనీయంగా ఉంది. స్వంత భూమి లేని వారు ఇతర ప్రాంతాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పూడ్చి పెడుతున్నారు. ఈ విషయంలో పట్టణంలోని పలువురు వ్యక్తులు గతంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని కోరారు. అయినా ఇప్పటి వరకు అధికారుల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.
సార్వజనీక ప్రాంతాలు
పట్టణంలోని గాంధీనగర్ వెనుక భాగంలో కట్టపైనా.. బాలాజీనగర్ నుంచి నాజ్‌ఖాన్‌పల్లికి వెళ్లే దారిలో ముళ్ల పొదల మాటున, ఎనికెపల్లికి వెళ్లే దారిలో ముళ్ల పొదల చాటున ఖననం చేస్తున్నారు. కొడంగల్ మున్సిపాలిటీగా మారిన తర్వాత సమస్యకు పరిష్కారం చూపలేదు. తేది 02.08.2018న కొడంగల్ పట్టణం మున్సిపాలిటీగా మారింది. 12 వార్డులతో ఏర్పాటు చేశారు. కొడంగల్, కొండారెడ్డిపల్లి, ఐనన్‌పల్లి, బూల్కాపూర్, పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, గుండ్లకుంట గ్రామాలను మున్సిపాలిటీలో కలిపారు. మున్సిపాలిటీ మొత్తంగా సుమారు 20 వేలకు పైగా జనాభా ఉంది.
కొడంగల్‌లో శ్మశానవాటికలు లేవు
మున్సిపల్‌లో ఒకటే దహనవాటిక
పేదోడు చనిపోతే తప్పని తిప్పలు
స్థలం కేటాయించాలి
కొడంగల్ మున్సిపల్ పరిధిలో స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలి. మెజారిటీ వర్గీయులకు ఆఖరి కార్యక్రమం నిర్వహించడానికి ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. పట్టణంలో సుమారు 14వేలకు పైగా జనాభా ఉంది. దహన వాటిక ఒక్కటే ఉంది. స్మశాన వాటికలు ఉండాలి.
– సిరుసని శ్యాంసుందర్, కొడంగల్


