పెడచెవిన ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

పెడచెవిన ప్రజావాణి

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మంగలి ఆంజనేయులు. వికారాబాద్‌ మండలం గొట్టిముక్లకు చెందిన ఇతను 1990లో గ్రామ సర్వే నంబర్‌ 53లో 2.8ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. 2006లో ఈ భూమి వేరేవారి పేరున రిజిస్ట్రేషన్‌ అయ్యింది. తహసీల్దార్‌, కలెక్టరేట్‌ వెళ్లినా పరిష్కారం కాలేదు. చేసేది లేక కోర్టును ఆశ్రయించాడు. ఏడాది క్రితం ఆ భూమి ఆంజనేయులకే చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదు.

ధారూరు మండలం కేరెళ్లి గ్రామానికి చెందిన కావలి నర్సింహులుకు ఐదెకరాల పొలం ఉంది. అటవీ భూమికి సమీపంలో ఉండటంతో నిషేధిత జాబితాలో వేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం బాధిత రైతు ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.. కానీ ఫలితం లేక అవస్థలు పడుతున్నాడు.. ఇవి మచ్చుకు కొన్నే.. పెద్ద సంఖ్యలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతునే ఉన్నారు.

వికారాబాద్‌: ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బాధితులు ప్రతి సోమవారం కార్యాలయాల గడపు తొక్కుతున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కలెక్టరేట్‌లో శాఖల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, మండల, నియోజకవర్గ స్థాయి సమస్యలను అక్కడి అధికారులకు రెఫర్‌ చేస్తున్నారు. కానీ చాలా సమస్యలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. బాధితుల వాణి వినడమే తప్ప వారి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వందకు పైగా అర్జీలు వస్తున్నా పది కూడా పరిష్కారం కావడం లేదు.

రెవెన్యూ సమస్యలే అధికం

గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏళ్ల తరబడి బాధితులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వచ్చిన ధరణిపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం కూడా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపలేకపోతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రజావాణికి పాత సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి.

పైసలిస్తేనే క్లియర్‌

భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. తహసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో డబ్బుల కోసం ప్రజల దరఖాస్తులను కావాలనే రిజక్ట్‌ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పైసలు అందిన వెంటనే ఫైళ్లలో కదలిక మొదలవుతున్నట్లు సమాచారం. లేకుంటే సంవత్సరాల తరబడి పెండింగ్‌ ఉంచుతున్నట్లు తెలిసింది. సాధారణంగా భూ సమస్యల పరిష్కారం కోసం బాధితులు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరిస్తారు. అయితే డబ్బులిస్తే నివేదిక ఇస్తున్నట్లు తెలిసింది. లేకుంటే రిజెక్ట్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం వందకు పైగా అర్జీలు

పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు

మళ్లీ మళ్లీ వస్తున్న బాధితులు

ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే..

అధిక శాతం రెవెన్యూ సమస్యలే..

భూ భారతి చట్టం వచ్చినా ఫలితం శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement