భవనం అడ్డుగా ఉందని ఆగిన పనులు
అసంపూర్తిగా మురుగు కాల్వ నిర్మాణం
కొడంగల్: పట్టణ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరవుతున్నా అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అలసత్వంతో పనులు ముందుకు సాగడం లేదు. కొడంగల్‌లోని మహబూబ్‌నగర్ – చించోలీ జాతీయ రహదారికి ఇరువైపులా చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణం ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా పేదల ఇండ్లు కూల్చారు. ఆలయాలు, మసీదులు, దర్గాలకు సంబంధించిన కట్టడాలను తొలగించారు. నిరుపేదలు నివాసం ఉండే గాంధీనగర్‌లో సైతం కట్టడాలను కూల్చివేశారు. ఎక్కడా కూడా ఆటంకం లేకుండా పనులు చకచక జరిగిపోయాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం అడ్డుగా ఉన్న భవనాలను ఎందుకు తొలగించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులను పెట్టి మా ఇళ్లు, పూరి గుడిసెలను తొలగించిన అధికారులు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాల్వల నిర్మాణానికి అడ్డుగా ఉన్న తమ భవనాలు కూల్చ వద్దని సదరు యజమాని అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారులు ఆ భవనాలను వదిలేసి పనులను అర్ధాంతరంగా ఆపినట్లు కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు


