రైతులకు తీవ్ర నష్టం
మంచన్‌పల్లిలో పట్టుబడిన నకిలీ ఎరువుల బస్తాలు
వికారాబాద్: జిల్లాలో పదిహేను రోజులుగా పట్టుబడుతూ వస్తున్న డీఏపీ నకిలీదేనని రుజువైంది. రికార్డుల్లో లేకుండా అనుమానాస్పదంగా విక్రయిస్తున్న డీఏపీ, 20:20 ఎరువులను పలు చోట్ల స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పరిగి, చన్గోముల్, బంట్వారం, యాలాల ఠాణాల్లో చీటింగ్ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేల సంఖ్యలో ఎరువుల బస్తాలు విక్రయించగా మెజార్టీ రైతులు తమ పంటపొలాల్లో వాడారు. విషయం బయటపడే నాటికి రైతులు, డీలర్ల వద్ద 400 పైచిలుకు బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఎరువుల సాంపిళ్లు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఎరువుల పరీక్ష(ల్యాబ్) కేంద్రానికి పంపించారు. ఇటీవల వచ్చిన రిపోర్టుల్లో సదరు ఎవరువులు నకిలీవని తేలడంతో మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది.
మట్టి గుళికలకు పూత
సాధారణంగా డీఏపీ ఎరువులో 46 శాతం భాస్వరం, 18 శాతం నత్రజని ఉంటుంది. 20:20 ఎరువులో 18 శాతం భాస్వరం, 18 శాతం నత్రజని ఉంటుంది. కానీ పట్టుబడిన డీఏపీలో కేవలం 3శాతం భాస్వరం, 1శాతం నత్రజని వాడి ఈ ఎరువును తయారు చేసినట్టు ల్యాబ్ రిపోర్ట్‌లో తేలింది. ఇప్పటికే వచ్చిన రెండు ఫలితాల్లో డీఏపీ గుళికల తయారీకి డోలమైట్ రకానికి చెందిన మట్టిని వాడినట్టు నిర్ధారించారు. ఈ మట్టి గుళికలకు పైపొరగా మూడు శాతం భాస్వరం, ఒక శాతం నత్రజని పూతగా పూసి ఎరువును తయారు చేసినట్లు టెస్ట్ ఫలితాలు వెల్లడించాయి. మరో రెండు సాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.
నత్తనడకన కేసు
ఇప్పటికే రాయితీ విత్తనాల కుంభకోణంలో వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర బట్టబయలు కావడంతో పలువురు అధికారులను సస్పెన్షన్‌తో పాటు రిమూవల్ చేశారు. ఇది మరవక ముందే నకిలీ ఎరువుల రూపంలో తాజాగా మరో వివాదం ఆ శాఖను చుట్టుముట్టింది. అయితే ఫర్టిలైజర్ దుకాణాల క్రయవిక్రయాలు, రైతులు వినియోగిస్తున్న ఎరువులు తదితర విషయాలపై ఆ శాఖ అధికారులు నియంత్రణ కోల్పోవడం ఇలాంటి ఘటనలకు తావిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ ఎరువుల కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుండడం కూడా విమర్శలకు తావిస్తుంది. ఇందులో పలువురు సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నకిలీ ఎరువుల వ్యవహారం అమాయక రైతు లను నిండా ముంచింది. ఓ పక్క ఎరువుల కొరత.. మరో పక్క కొనుగోళ్ల నిబంధనలు వీరిని నకిలీ ఎరువుల కొనుగోలుకు పరుగులు పెట్టేలా చేశాయి. సాధారణంగా ప్రభుత్వం విక్రయిస్తున్న డీఏపీ బస్తా ఎమ్మార్పీ రూ.1,350 ఉండగా.. ఈ నకిలీ ఎరువులను మాత్రం ఒక్కో బస్తా రూ.1,800 చొప్పున అన్నదాతలకు అంటగట్టారు. పరిగి, పూడూరు, పెద్దేముల్ మండలాల్లో ఈ విక్రయాలు జో రుగా జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
డోలమైట్ మట్టి గుళికలతో నకిలీ డీఏపీ
యథేచ్ఛగా రైతులకు విక్రయించిన వైనం
రాయితీ విత్తనాల ఘటన మరవకముందే ఎరువుల మోసం
ల్యాబ్ రిపోర్టుల్లో విస్తుపోయే వాస్తవాలు
నిండా మునిగిన అన్నదాతలు


