మత్స్యసంపదకు ఎల్‌నినో ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మత్స్యసంపదకు ఎల్‌నినో ఎఫెక్ట్‌

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

పరిగి: ఎల్‌నినో ఎఫెక్ట్‌ కారణంగా రైతులతో పాటు మత్స్యకారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వానాకాలంలో నేటి వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదవ్వలేదు. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో సగం నీరు కూడా రాలేదు. వెరసి చేపల పిల్లల పెంపకం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ ప్రభావం మత్స్యకారుల జీవనోపాధిపై చూపనుంది. ప్రస్తుతం ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. చెరువుల్లో, కుంటల్లో సరిపడా నీరు చేరకపోవడంతో 152 మత్స్యసహకార సంఘాల్లోని 5,665 మంది సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం

జిల్లా వ్యాప్తంగా 1,179 చెరువులు, కుంటలు ఉండగా 779 చెరువు, కుంటల్లో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో ప్రాజెక్టుల్లో సరిపడ నీరు ఉండగా మెజార్టీ చెరువుల్లో సగం కంటే తక్కువగానే నీరు చేరింది. చిన్నపాటి కుంటలు సైతం అడుగంటాయి. చెరువు, కుంటల్లో 60 శాతానికి పైగా నీరు చేరితేనే పిల్లల పెంపకానికి అనువుగా ఉంటుంది. అంతకంటే తక్కువగా ఉంటే ఎదుగుదలపై ప్రభావం పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. గతేడాది జూలైలోనే చెరువు మత్తడి దుంకడంతో మత్స్యకారులు చేప పిల్లలను వదిలారు.

వట్టిపోతోన్న తిమ్మాయిపల్లి చెరువు

వర్షభావం కారణంగా చెరువుల్లోకి చేరని నీరు

చేపపిల్లల పెంపకంపై నీలినీడలు

మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం

గత ఏడాది ముందుగానే వదిలాం

గతేడాది ఆగస్టుకు ముందుగానే చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలాం. ప్రభుత్వం పంపిణీ చేసిన పిల్లలను ఆలస్యంగా వదిలాం. ఈ ఏడాది ఇప్పటి వరకు సరిపడా నీరు లేక వదిలేందుకు వెనుకడుగు వేస్తున్నాం. నీరు రాకపోతే రూ.లక్షల్లో నష్టపోవాల్సి ఉంటుంది. – నర్సింలు,

మత్స్యసహకార సంఘ నాయకుడు, పాలేపల్లి

తీవ్రంగా నష్టపోతాం

చెరువుల్లో సరిపడా నీరు రాకపోతే చేపపిల్లల పెంపకం కష్టమవుతుంది. మత్స్యకారుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 60 శాతం నీరు చేరితేనే లాభం ఉంటుంది. లేదంటే తీవ్రంగా నష్టపోతాం.

– రాఘవేందర్‌ముదిరాజ్‌, మత్స్య సహకార సంఘం చైర్మన్‌, మోత్కూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement