‘బ్లూకోట్‌’తో నిలిచిన ప్రాణం | - | Sakshi
Sakshi News home page

‘బ్లూకోట్‌’తో నిలిచిన ప్రాణం

Aug 7 2026 6:34 AM | Updated on Aug 7 2026 6:34 AM

చనిపోతున్నానని డయల్‌ 100కు

ఫోన్‌ చేసిన యువకుడు

సకాలంలో స్పందించి,

రక్షించిన బ్లూకోట్‌ కానిస్టేబుళ్లు

యాలాల: ‘అప్పులు ఎక్కువయ్యాయి.. ఇక బతకాలని లేదు.. అందుకే రైలు కిందపడి చనిపోవాలనుకుంటున్నా’ అని ఓ యువకుడు 100 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన బ్లూకోట్‌ కానిస్టేబుళ్లు సదరు వ్యక్తి ఫోన్‌ నంబర్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేస్తూ.. రైలు పట్టాలపై కనిపించిన అతన్ని కాపాడి, అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని కోకట్‌ శివారులో జరిగింది. గ్రామానికి చెందిన అక్తర్‌ పాష బుధవారం రాత్రి వేళ కోకట్‌ శివారు నుంచి రైల్వే పట్టాల వద్దకు చేరుకొని, తనకు అప్పులు ఎక్కువయ్యాయని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నానని 100కు ఫోన్‌ చేసి చెప్పాడు. హెడ్‌క్వార్టర్స్‌ నుంచి వచ్చిన డయల్‌ 100 అలర్ట్‌ కాల్‌తో అప్రమత్తమైన బ్లూకోట్‌ కానిస్టేబుళ్లు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌.. పాష సెల్‌ ఫోన్‌ నంబర్‌ను ట్రేస్‌ చేస్తూ, అతనితో ఫోన్‌ మాట్లాడుతూ.. రైలు పట్టాల వద్దకు చేరుకుని, అతన్ని పట్టుకున్నారు. కుటుంబ సభ్యులను పిలిపించి, గ్రామస్తుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు. సకాలంలో స్పందించిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్‌ఐ విఠల్‌రెడ్డి అభినందించారు.

టీజీ సీపీ గెట్‌లో

అశ్వినికి 23వ ర్యాంక్‌

దోమ: ఇటీవల విడుదలైన టీజీ సీపీ గెట్‌ –2026 ఫలితాల్లో దోమ మండలం, శివారెడ్డి పల్లికి చెందిన దర్పల్లి అశ్విని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంఎస్సీ ఫిజిక్స్‌ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్‌ సాధించారు. అశ్వినిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, బంధువులు, స్నేహితులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

బంగారు దుకాణంలో చోరీ

10 గ్రాముల నెక్లెస్‌ మాయం

తాండూరు టౌన్‌: పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో చోరీ జరిగింది. పట్టణ సీఐ పరమేశ్వర్‌ గౌడ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాంధీచౌక్‌ సమీపంలోని గంజిపల్లి సాయి జ్యుయెల్లర్స్‌కి గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు వచ్చారు. షోకేస్‌లోని 10 గ్రాములు నెక్లెస్‌ను చూపించాలని కోరారు. తర్వాత మరొకటి చూపించాలని అడగగా వర్కర్‌ లోపలికి వెళ్లాడు. వెంటనే నక్లెస్‌ను బ్యాగులో వేసుకున్నారు. తర్వాత ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. యజమాని షోకేస్‌లోని నక్లెస్‌ లేకపోవడాన్ని గుర్తించాడు. వెంటనే సీసీ ఫుటేజీని పరిశీలించగా మహిళలు చోరీ చేసినట్లు నిర్ధారించుకున్నారు. యజమాని ఠాకూర్‌ అమన్‌సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పంద్రాగస్టు నాటికి

యూనిఫాంల పంపిణీ

బషీరాబాద్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి యూనిఫాంలు అందజేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి తెలిపారు. గురువారం బషీరాబాద్‌ ఎంపీపీఎస్‌లో టీచర్లతో కలిసి విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే తొలి జత యూనిఫాంల పంపిణీ పూర్తయిందని, రెండో జత కుట్టు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని వివరించారు. ప్రభుత్వం సరఫరా చేసిన వస్త్రంతో ఒక్కో విద్యార్థికి రూ.74 వ్యయంతో మహిళా సంఘాలే యూనిఫాంలను కుట్టి అందిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అస్మాఖతామ్‌, ఉపాధ్యాయులు చంద్రకళ, ఐఆర్‌పీ జ్యోతి, మహిళా సంఘాల ప్రతినిధి భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

సాగుకు అడ్డు తగులుతున్న వ్యక్తి అరెస్ట్‌

మోమిన్‌పేట: పంట సాగుకు అడ్డు పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ భరత్‌భూషణ్‌ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలోని బూర్గుపల్లికి చెందిన మేక ల శ్రీనివాస్‌, మేకల నగేశ్‌, మేకల శోభరాణి గత నెల 27న అదే గ్రామానికి చెందిన మంతెన కృష్ణం రాజు భూమిలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement