మోమిన్‌పేట: కట్టెల వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఓ వ్యక్తి ఆశ చూపి కోట్ల రూపాయలు కాజేశాడు. ఈ ఘటన మోమిన్‌పేటలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం డ్రైవర్ కాలనీకి చెందిన అజారొద్దీన్ కొన్నేళ్ల నుంచి మోమిన్‌పేటలో కట్టెల వ్యాపారం చేస్తూ ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. చుట్టు పక్కల వారితో పరిచయం పెంచుకున్నాడు. కట్టెల వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టాడు. దీంతో పలువురు రూ.లక్షల్లో డబ్బులు కట్టారు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఈ నెల 3వ తేదీ డబ్బులిచ్చిన వారందరికీ అజారొద్దీన్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. వ్యాపారంలో కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, తాను తిరిగి వచ్చిన తర్వాత అందరికీ డబ్బులు చెల్లిస్తానని మెసేజ్ పెట్టి సెల్‌ఫోన్‌లో సిమ్ కార్డు తీసేశాడు. ఈ నెల 4న బాధితులు అజారొద్దీన్ ఇంటికి వెళ్లారు. అప్పటికే సదరు వ్యక్తి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఇంటి యజమానికి ఆరు నెలల అద్దె తోపాటు అతని వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోమిన్‌పేటకు చెందిన మరో వ్యక్తి ఫైసల్ కట్టెల వ్యాపారంలో రూ.66 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అందులో రూ.22 లక్షలు అజారొద్దీన్ తిరిగి చెల్లించాడు. మరో రూ.44 లక్షలు ఇవ్వాల్సి ఉందని ఫైసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మరికొంత మంది బాధితులు కూడా ఉన్నట్లు తెలిసింది.
పలువురి నుంచి భారీగా
డబ్బు తీసుకున్న నిందితుడు
రూ.3 కోట్లతో పరారీ
ఆలస్యంగా వెలుగులోకి..
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు


