● రైతులు, వినియోగదారులుస్వయం మరమ్మతులు చేయొద్దు
● అప్రమత్తంగా లేకపోతే
ప్రాణాలకే ప్రమాదం
అవగాహన కల్పించాలి
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఏ సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయో తెలియదు. తప్పని పరిస్థితిలో కొంత మంది రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, మోటార్ల వద్ద స్వయంగా మరమ్మతులు చేస్తుంటారు. అలా చేయకుండా అవగాహన కల్పించాలి.
– అర్జున్‌రెడ్డి, రైతు, శివారెడ్డిపల్లి
జాగ్రత్తలు తప్పనిసరి
కరెంటు సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ లైన్‌మెన్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. పొలాల్లో తీగలు వేలాడినా, కిందికి జారిపడినా, ట్రాన్స్‌ఫార్మర్ నడవకపోయినా వెంటనే సమాచారం ఇవ్వాలి. రైతులు నేరుగా మరమ్మతులు చేయడం ప్రమాదకరం.
– అహ్మద్, విద్యుత్ ఏఈ, దోమ
దోమ: వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో కరెంటు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇళ్ల వద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోరుబావులు, వాగులు, పొలాల వద్ద విద్యుత్ మోటర్ల ద్వారా రైతులు పంటలకు నీళ్లు అందిస్తారు. విద్యుత్ వినియోగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.
మూడింటికే పరిహారం..
విద్యుత్ సంస్థలు కేవలం ప్రాణ నష్టాలకు మాత్రమే పరిహారం అందిస్తాయి. మనుషులు, పశువులు మరణిస్తే ఆర్థిక సాయం అందుతుంది. కానీ గాయాలపాలైతే ఎలాంటి పరిహారం రాదు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మనుషులు చనిపోతే రూ.8 లక్షలు, ఆవులు, గేదెలు మృతి చెందితే రూ.45 వేలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడితే రూ.5 వేల చొప్పున పరిహారం అందిస్తాయి. ప్రమాద స్థలంలోని ఫొటోలతో పాటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, శవ పంచనామా రిపోర్ట్‌ను సంబంధిత శాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. మూగజీవాలకై తే ఫొటోలతో పాటు వెటర్నరీ డాక్టర్ పోస్టుమార్టం నివేదిక తప్పనిసరి.
పరిహారం వీరికే..
● అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగి కింద పడినప్పుడు వాటికి తగిలి మనుషులు, పశువులు మరణిస్తే నష్ట పరిహారం అందిస్తారు.
● ట్రాన్స్‌ఫార్మర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు వాటికి తగిలి మృతి చెందిన ఘటనల్లోనూ పరిహారం అందుతుంది.
● తక్కువ ఎత్తులో వేలాడుతున్న తీగలు తగిలి మృత్యువాత పడినా ఇది వర్తిస్తుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు..
● బావిలోని మోటర్లను నేలపై కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెలపై ఏర్పాటు చేసుకోవాలి.
● స్టార్టర్ బోర్డు తడవకుండా చూసుకోవాలి.
● మోటార్లు నడవకపోయినా, ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైనా సంబంధిత మెకానిక్‌లను పిలిపించి, బాగు చేయించాలి.
● సర్వీస్ వైర్లు, మోటర్‌కు నాణ్యమైన తీగలు వాడాలి.
● వైర్లు దెబ్బతింటే వెంటనే వాటికి టెపు వేసేలా చర్యలు తీసుకోవాలి.
● సబ్ మెర్సిబుల్ మోటార్లలో వైరు తెగితే పైన ఉండే వస్తువుల వరకూ విద్యుత్ సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. పైన ఉండే పైపులు, స్టార్టర్ డబ్బాలను నేరుగా పట్టుకోకుండా, చేతితో తాకి పరీక్షించాలి.


