పెండింగ్ పనులు కొన్ని..
వికారాబాద్: అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూమిపూజ చేసి ప్రారంభించకుండా వదిలేసిన పనులపై వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పార్టీ క్యాడర్‌తో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సొంత నియోజకవర్గం నుంచే నిరసనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ హయాంలో మంజూరై నిర్లక్ష్యానికి గురవుతున్న పలు పనులతో పాటు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో శిలాఫలకాలు వేసి పనులు చేపట్టని పనులపై ఉద్యమిస్తున్నారు. బుధవారం బీఆర్‌ఎస్ నేతలు వికారాబాద్ పట్టణంలో శిలాఫలకాల వద్ద కేక్‌కట్ చేసి రెండవ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
సీఎం వివక్షపై గళం
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే తన సొంత నియోజకవర్గం కొడంగల్ సమగ్రాభివృద్ధి కోసం కడా(కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అయితే మిగతా నియోజకవర్గాలు వికారాబాద్, పరిగి, తాండూరుపై వివక్ష చూపారనే విమర్శలు వచ్చాయి. ఏడాది క్రితం జిల్లా పరిధిలోని అన్ని జీపీలు, మున్సిపాలిటీలను కలుపుతూ వుడా(వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. జీఓ మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదని ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వుడా అంశంపై కూడా బీఆర్‌ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది. కడా తరహాలోనే వుడాను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. ఏడాదిన్న కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. పరిగి – వికారాబాద్, పరగి – షాద్‌నగర్ రోడ్లు మినహా మిగతా ఏ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కొడంగల్ మినహా మిగతా మూడు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి పరిధిలో పెద్దగా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు విజయం కోసం భారీగా శ్రమించాల్సి వచ్చింది. జిల్లాలో అనేక రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. పనుల జాప్యంపై ఎమ్మెల్యేలు సైతం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటిపై బీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో పోరుబాటకు సిద్ధమైంది. ప్రభుత్వ వైఖరి, వివక్షపై గళం వినిపించేందుకు ఆ పార్టీ నేతలు కార్యాచరణ రూపొందించారు.
పెండింగ్ పనులపై
వినూత్న నిరసన
శిలాఫలకాలకు పుట్టిన రోజు వేడుకలు
స్పీకర్ నియోజకవర్గం నుంచే మొదలు
సీఎం వివక్ష ధోరణిపై నేతల మండిపాటు
వికారాబాద్ పట్టణంలో ఏడాది క్రితం ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణానికి భూమిపూజ చేసి వదిలేశారు.
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి నుంచి గెరిగేట్‌పల్లి మీదుగా వెళ్లే రోడ్డు పనులకు శిలాఫలకం వేసి ఏడాది పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు.
కొత్తగడి నుంచి మద్దులపల్లి బీటీ రోడ్డు శిలాఫలకానికే పరిమితమైంది.
వికారాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు పనులు ప్రారంభం కాగా కాంగ్రెస్ వచ్చాక నిలిచిపోయాయి.
హైదరాబాద్, పరిగి తదితర ప్రాంతాలకు వెళ్లేందుక కనెక్టివిటీగా ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి బీఆర్‌ఎస్ హయాంలో శంకుస్థాపన చేయగా పనులు నత్తతో పోటీ పడుతున్నాయి.
మోమిన్‌పేట మండలం ఎన్కెతల గ్రామంలో ఏడాది క్రితం పారిశ్రామిక వాడ ఏర్పాటుకు శిలాఫలకం వేసి వదలేశారు.
తాండూరు – వికారాబాద్ మధ్య బీటీ రోడ్డు మంజూరైందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రెండేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
తాండూరులో పారిశ్రామిక వాడకు ఏడాది క్రితం శిలాఫలకం వేసి వదిలేశారు.
తాండూరు నియోజకవర్గం రాంపూర్ తండా, కరన్‌కోట్, జీవన్గీ రోడ్లు పూర్తి కావడం లేదు.
పరిగి మున్సిపల్ పరిధిలో రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు శిలాఫలకాలు వేసి ఏడాది దాటింది.
పరిగి – లఖ్నాపూర్ రోడ్డు పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
గడిసింగాపూర్ – రంగారెడ్డిపల్లి రోడ్డు పనులను ప్రారంభించి వదిలేశారు.


