పసందైన భోజనం | - | Sakshi
Sakshi News home page

పసందైన భోజనం

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

కొడంగల్‌: వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లోని 670 ప్రభుత్వ పాఠశాలలు, 12 జూనియర్‌ కళాశాలల్లో ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల ఆకలి కేకలు వినించరాదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పసందైన భోజనం పెట్టిస్తున్నారు. హరేకృష్ణ మూమెంట్‌ చారిటబుల్‌ ట్రస్టు ఈ బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టింది. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్‌, పరిగి, తాండూరు, దోమ, కుల్కచర్ల, బషీరాబాద్‌, యాలాల, అలాగే నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూరు, గుండుమాల్‌, కొత్తపల్లి మండలాల్లో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. కొడంగల్‌, పరిగి, తాండూరు, బషీరాబాద్‌, బొంరాస్‌పేట, హకీంపేట, దోమ, కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్‌, కొత్తపల్లి, గుండుమాల్‌ మండలాల్లోని 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 3,200 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు హరేకృష్ణ మూమెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ పీఆర్‌ మేనేజర్‌ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. రోజూ ఉదయం 42 వాహనాల్లో టిఫిన్‌ను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

మెనూ ఇలా..

ఇడ్లీ సాంబారు, మిల్లెట్‌ ఇడ్లీ సాంబార్‌, దోశ చట్నీ, పూరీ ఆలూ కుర్మా, ఉప్మా చట్నీ, ఉగ్రాని – పొంగల్‌ – చట్నీ, బోండా చట్నీ రోజూ ఏదో ఒకటి అందిస్తున్నారు. రోజు విడిచి రోజు పాలు ఇస్తున్నారు. వేడి వేడి రుచికరంగా ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అంటూ విద్యార్థులు ఆస్వాదిస్తున్నారు. కొడంగల్‌లోని సెంట్రలైజ్‌డ్‌ కమ్యూనిటీ కిచెన్‌లో వంటలు చేస్తున్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌, వయాట్రీస్‌ సంస్థ, సింగరేణి సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తోంది. సీఎస్‌ఆర్‌(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబిలిటీ) నిధులతో నడిపిస్తున్నారు. ప్రధాన కంపెనీలు వారి ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఈ పథకానికి కేటాయిస్తున్నారు.

ఆశయం వెనుక ఐదుగురు

పేద విద్యార్థులకు ఉదయం పూట బలవర్ధకమైన అల్ఫాహారం అందించే పథకం వెనుక ఐదుగురు వ్యక్తుల కృషి ఉంది. అందులో మొదటి వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన చొరవతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస ప్రభూజీ, వయాట్రీస్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధుల ఇండియా హెడ్‌ మిచెల్‌ డొమినికా, సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌, తెలంగాణ సోషల్‌ ఇంఫాక్ట్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అర్చన సురేష్‌ సహకారం ఎంతో ఉంది.

సర్కారు బడుల్లో రోజూ 52వేల మందికి అల్పాహారం

3,200 మందికి మధ్యాహ్న భోజనం

670 పాఠశాలలు, 12 జూనియర్‌ కళాశాలలకు ప్రయోజనం

ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement