తాండూరు టౌన్: డిజటల్ ప్రపంచంలో అప్రమత్తత ఎంతో అవసరమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. బుధవారం తాండూరులోని ఇందిరా చౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లు ఓపెన్ చేయరాదని, నకిలీ పెట్టుబడి ఆఫర్లు, పార్ట్‌టైం ఉద్యోగాల వలలో చిక్కరాదన్నారు. ఓటీపీ, సీవీవీ వివరాలు ఎవరికీ చెప్పరాదన్నారు. సైబర్ భద్రతపై విద్యార్థులు సైతం అవగాహన పెంచుకోవాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పొరపాటున నేరగాళ్ల ఫోన్‌కాల్స్‌కు ఓటీపీ నంబర్లను చెప్పరాదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ, రూరల్ సీఐలు పరమేశ్వర్, ప్రవీణ్ కుమార్, డివిజన్ ఎస్సైలు, పలు పాఠశాలల విద్యార్థులు, పట్టణ వాసులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
సైబర్ భద్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి
ఎస్పీ స్నేహ మెహ్ర


