● సంగెంకలాన్ సర్పంచ్ మీనాక్షి
● పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన
తాండూరు రూరల్: మండలంలోని సంగెంకలాన్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆ గ్రామ సర్పంచ్ మీనాక్షి డిమాండ్ చేశారు. బుధవారం పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, హెచ్‌ఎంతో కలిపి నలుగురు ఉపాధ్యాయులే ఉన్నారన్నారు. ఇందులో ఓ టీచర్ ప్రసూతి సెలవుల్లో వెళ్లిందన్నారు. మరో టీచర్ నాగలక్ష్మిని డిప్యూటేషన్‌పై దోమ మండలానికి వేశారని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతో ఏడు తరగతులు నిర్వహించడం చాలా కష్టంగా ఉందన్నారు. ఇంగ్లిష్, గణిత సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక పాఠాలు సాగడం లేదన్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, పరికప్ప, శ్రీకాంత్‌రెడ్డి, జగదీష్, విద్యార్థులు పాల్గొన్నారు.


