బషీరాబాద్: సీ్త్రనిధి రుణాల బకాయిలను వసూలు చేసి దుర్వినియోగం చేశారంటూ తమపై సస్పెన్షన్ వేటు వేయడం వెనక ఆడిటర్ల తప్పుడు నివేదికలే కారణమని ఎక్మాయి గ్రామ మహిళా సమాఖ్య వీఏఓలు స్వప్న, వాణీశ్రీ ఆరోపించారు. తాము వసూలు చేసిన డబ్బులను సీ్త్రనిధి ఖాతాల్లో జమ చేసినప్పటికీ వాటిని లెక్కల్లో చూపకుండా, మహిళల వద్ద ఉన్న మొండి బకాయిలను తమపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్మాయిలో విలేకరులతో మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు.
డబ్బులు వాడుకున్నట్లు రాయించుకున్నారు
ఎక్మాయి గ్రామ సమాఖ్య వీఏఓ– 1 స్వప్న మాట్లాడుతూ.. తన పేరుపై రూ.4.58 లక్షల బకాయి చూపించారని తెలిపారు. అందులో రూ.2 లక్షలను జూలై నెలలోనే సీ్త్రనిధి ఖాతాలో జమ చేశానని చెప్పారు. మిగిలిన రూ.2.58 లక్షలు ఏడు సంఘాలకు చెందిన ఎనిమిది మంది మహిళల వద్ద మొండి బకాయిలుగా ఉన్నాయని వివరించారు. ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తానే డబ్బులు వాడుకున్నట్లు లేఖ రాయించుకుని ఆడిటర్ సంగీత అన్యాయం చేశారని ఆరోపించారు.
మొండిబకాయిలను లెక్క చూపారు
వీఏఓ– 2 వాణీశ్రీ మాట్లాడుతూ.. తన పేరుపై రూ.3.05 లక్షల బకాయి ఉన్నట్లు ఆడిటర్ సంగీత బలవంతంగా లేఖ రాయించుకున్నారని ఆరోపించారు. తాను ఇప్పటికే రూ.1.74 లక్షలను సీ్త్రనిధి ఖాతా నంబర్ 79005829606లో జమ చేశానని తెలిపారు. మిగిలిన మొత్తం బాలాజీ, అర్చన పొదుపు సంఘాలకు చెందిన మహిళల వద్ద మొండి బకాయిలు ఉందని వివరించారు.
సీసీ నిర్లక్ష్యమే..
బకాయిల వసూళ్లలో జాప్యానికి అప్పటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ) రాములు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఇద్దరు వీఏఓలు ఆరోపించారు. పలుమార్లు సమాచారం ఇచ్చినా మూడు నెలల వ్యవధిలో ఒక్కరోజు కూడా గ్రామానికి వచ్చి వసూళ్లపై దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. ఆడిట్ అధికారులు, సీ్త్రనిధి యాజమాన్యం వాస్తవాలను పక్కనపెట్టి తమపై చర్యలు తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జమ చేసిన మొత్తాలకు సంబంధించిన బ్యాంకు రశీదులు, లావాదేవీల ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై పునర్విచారణ జరిపి న్యాయం చేయాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.
సూత్రధారి సీసీ రాములేనా..?
ఈ వ్యవహారంలో అప్పటి సీసీ రాములే ప్రధాన సూత్రధారి అనే చర్చ ఐకేపీ వర్గాల్లో సాగుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలతో పాటు ఓ మహిళా సీసీతో సన్నిహితంగా ఉంటూ అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ అతన్ని విధుల నుంచి తొలగించారు. దీంతో ఎక్మాయి సీ్త్రనిధి వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పునర్విచారణ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత వీఏఓలు కోరుతున్నారు.
సీ్త్రనిధి అక్రమాలపై వీఏఓల ఆవేదన
ఖాతాలో జమచేసిన డబ్బులు లెక్కల్లో చూపలేదని వెల్లడి
రశీదులు, ఆధారాలు ఉన్నాయని,
అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటన
పెండింగ్ మొండి బకాయిలను
తమపై మోపారని కన్నీటి పర్యంతం
సీసీ నిర్లక్ష్యమే వీటన్నింటికీ
కారణమని ఆరోపణ


