● రాష్ట్రాల వాటా ఉపసంహరించుకోవాలి
● స్పీకర్ ప్రసాద్ కుమార్ డిమాండ్
బంట్వారం: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోపించారు. బుధవారం బంట్వారం, కోట్‌పల్లిలో మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారు ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. వలసల నివారణ కోసం కాంగ్రెస్ తెచ్చిన ఈ పథకం పేరు మార్చడం సరికాదన్నారు. రాష్ట్రాల చెల్లింపు వాటా 40 శాతాన్ని ఉప సంహరించుకోవడంతోపాటు పాత పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు రూ.8.25 లక్షల కోట్లకు నెలనెలా రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నట్లు తెలిపారు. అయినా సంక్షేమం, అభివృద్ధి ఆపడం లేదన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ పథకాలు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ సమస్యపై సర్పంచ్‌లు మల్లేశం, గోరేమియ, సంజీవులు ట్రాన్స్‌కో ఇన్‌చార్జ్ ఏఈని నిలదీశారు. సమస్య చెబుదామని ఫోన్ చేస్తే స్పందించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నచ్చజెప్పి సదరు ఏఈని మందలించారు. వెంటనే సమస్యల పరిష్కారాని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఎంపీడీఓలు రాములు, హేమంత్, తహసీల్దార్లు విజయ్ కుమార్, ఆనంద్ రావు, డీఎస్పీ అంజయ్య, ఎంపీఓలు నాగరాజు, సురేందర్‌రెడ్డి, పీఆర్ డీఈ శ్రీనివాస్, ఏఓలు కరణాకర్‌రెడ్డి, శ్రావ్య, హార్టీకల్చర్ ఆఫీసర్ కమల, మెడికల్ ఆఫీసర్లు మజీద్ ఖాన్, మేఘన తదితరులు పాల్గొన్నారు.


