నావంద్గీ సొసైటీలో కలకలం | - | Sakshi
Sakshi News home page

నావంద్గీ సొసైటీలో కలకలం

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

బషీరాబాద్‌: నావంద్గీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌)లో గోల్డ్‌ లోన్‌ మంజూరు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సంఘం బ్యాంకుకు చెందిన ఓ ఉద్యోగికి నిబంధనలకు విరుద్ధంగా బంగారు రుణం మంజూరు చేసినట్లు అనుమానం రావడంతో బుధవారం సొసైటీ చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి జిల్లా సహకార అధికారి (డీసీఓ)కు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీఓ ఆదేశాల మేరకు లక్ష్మీనారాయణపూర్‌ డీసీసీబీ బ్యాంకు మేనేజర్‌ డి.మమత సొసైటీలో విచారణ చేపట్టారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ డీసీసీబీ బ్యాంకులో కలెక్షన్‌ అధికారిగా పనిచేస్తున్న పి.రాములు ఈ నెల 4న నావంద్గీ సొసైటీలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.3.50 లక్షల రుణం పొందాడు. అయితే ఈ రుణం మంజూరులో నిబంధనలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అప్రైజర్‌ ద్వారా బంగారం విలువ నిర్ధారణ చేయకుండానే సీఈఓ వెంకటయ్య రుణం మంజూరు చేసినట్లు తేలింది. ఫిర్యాదుకు ముందు చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి సొసైటీ లాకర్‌, స్ట్రాంగ్‌రూమ్‌ను సీజ్‌ చేశారు. విచారణకు వచ్చిన లక్ష్మీనారాయణపూర్‌ డీసీసీబీ బ్యాంకు మేనేజర్‌ డి.మమత లాకర్‌లో ఉన్న 510 గోల్డ్‌ లోన్‌ ఖాతాలు, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విచారణలో పి.రాములు గతంలో మే 7న కూడా ఇదే సొసైటీ నుంచి రూ.3.50 లక్షల గోల్డ్‌ లోన్‌ తీసుకున్నట్లు గుర్తించారు. అనంతరం జులై 4న రుణాన్ని చెల్లించి, తిరిగి ఈ నెల 4న మరోసారి అదే మొత్తంలో రుణం పొందినట్లు రికార్డుల్లో తేలింది. విచారణ అనంతరం డి.మమత మాట్లాడుతూ.. గోల్డ్‌ లోన్‌ మంజూరుకు ముందు అప్రైజర్‌ వేదాంతచారి బంగారు ఆభరణాలను పరిశీలించి విలువ నిర్ధారించడం తప్పనిసరి అని తెలిపారు. అయితే సంబంధిత రుణం విషయంలో అప్రైజర్‌ పరిశీలన లేకుండానే సీఈఓ వెంకటయ్య రూ.3.50 లక్షల రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇది సహకార సంఘాల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతోనే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సహకార వర్గాలు తెలిపాయి.

ఉద్యోగికి బంగారు రుణంపై

అనుమానాలు

డీసీఓకు చైర్మన్‌ ఫిర్యాదు.. లాకర్‌ సీజ్‌

విచారణ జరిపిన డీసీసీబీ మేనేజర్‌

నిబంధనల ప్రకారం

రుణం ఇవ్వలేదని తేటతెల్లం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement