వేర్వేరు ఘటనల్లో ముగ్గురు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు అదృశ్యం

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

శంకర్‌పల్లి: వెల్డింగ్‌ కార్మికుడు అదృశ్యమైన ఘటన మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. కేరళం రాష్ట్రానికి చెందిన అనిల్‌కుమార్‌(45) బతుకుదెరువు నిమిత్తం మోకిలకు వచ్చాడు. మిత్రుడు హేమంత్‌తో కలిసి ఉంటూ కొండకల్‌ అపర్ణ కంపెనీలో వెల్డింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. హేమంత్‌ ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

అదృశ్యమైన బాలిక తిరుపతిలో ఉన్నానని ఫోన్‌

పహాడీషరీఫ్‌: మానసిక స్థితి సరిగ్గా లేక ఐదు నెలల క్రితం అదృశ్యమైన ఓ బాలిక, తాను తిరుపతిలో ఉన్నట్లు రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసింది. బాలాపూర్‌ ఎస్‌ఐ సోహెల్‌ తెలిపిన ప్రకారం.. కాచిగూడ నింబోలి అడ్డాకు చెందిన రాజు కుమార్తె పూజ(17)కు మానసిక స్థితి సరిగ్గా లేదు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ రిఫరెన్స్‌తో ఈ ఏడాది మార్చి మొదటివారం షాహిన్‌నగర్‌ సమీపంలోని ఐఎఫ్‌టీ బాలికల హోమ్‌లో చేర్పించారు. ఇదే నెల 10న బాలిక ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. హోమ్‌ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ తెలిస్తే బాలాపూర్‌ పీఎస్‌లో లేదా 87126 62366 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

కుటుంబ కలహాలతో యువకుడు..

మాడ్గుల: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు అదృశ్యమైన ఘటన మాడ్గుల ఠాణా పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ వేణుగోపాల్‌రావు తెలిపిన ప్రకారం.. చాంద్రాయణపల్లికి చెందిన మానుపాటి నరేశ్‌(24)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 3వ తేదీన సాయంత్రం జరిగిన గొడవలో మనస్థాపంతో నరేశ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నరేశ్‌ తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement