వసూళ్ల పర్వం! | - | Sakshi
Sakshi News home page

వసూళ్ల పర్వం!

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

నిబంధనలు గాలికి..

బ్రోకర్లను ఆశ్రయించొద్దు

ఆర్టీఏ కార్యాలయంలో అంతులేని అవినీతి

ఒక్కో పనికి ఒక్కో రేటు

వాహనాలు చూడకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు

ఏజెంట్లను నియమించుకొని దండుకుంటున్న వైనం

రవాణా శాఖ మంత్రి దృష్టికి కరప్షన్‌ భాగోతం

వికారాబాద్‌: ఆర్టీఏ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన రుసుంకు ఏ ఒక్క సేవ కూడా అందడం లేదు. కొన్ని పనులకు రెండింతలు, మరికొన్నింటికి ఐదింతలు దండుకొంటున్నారు. ద్విచక్ర, ఫోర్‌ వీలర్‌ లైసెన్సులు, వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్‌ ఇలా ఏ పని కావాలన్నా కార్యాలయంలోని అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఏజెంట్లను నియమించుకొని దందాకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ వ్యవహారం రవాణా శాఖ మంత్రి వరకు వెళ్లినట్లు తెలిసింది. కొంత మంది బ్రోకర్లు.. ఆర్టీఏ అధికారుల మధ్య పంపకాల వివాదం తలెత్తి చివరకు మంత్రిని కలిసి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. డీటీఓ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బీజేపీ నేతలు బాధితులతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీఏ అవినీతిపై ఏసీబీ అధికారులు సైతం నిఘా పెట్టినట్టు సమాచారం. ఇటీవల కుల్కచర్ల మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన కనకం మైబమ్మ ట్రాక్టర్‌ కొనుగోలు చేసింది. దాన్ని వ్యవసాయ అవసరాల నిమిత్తం రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంది. భూమి లేదనే కారణంతో ఆర్టీఏ అధికారులు రిజక్ట్‌ చేశారు. అయితే మైబమ్మ భర్త పేరిట ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ విషయాన్ని సదరు మహిళ అధికారుల దృష్టికి తెచ్చినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

రేటు ఫిక్స్‌ చేసి..

ఆర్టీఏ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్‌ చేశారు. బ్రోకర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌, లెర్నింగ్‌ లైసెన్స్‌, లైసెన్స్‌, ట్రయల్‌ రన్‌ ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూ వీలర్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌కు రూ.300, ట్రయల్‌ రన్‌కు రూ.1,200, ఫోర్‌ వీలర్‌(కారు)లెర్నింగ్‌కు రూ.450, ట్రయల్‌ రన్‌కు రూ.1,350 రుసుం వసూలు చేయాలి. అలాగే ఆటో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌కు రూ.800, క్యాబ్‌ వెహికల్‌కు రూ.1,000, లారీకి రూ.1,200 తీసుకోవాలి. కానీ ఆటోకు రూ.2 వేలు, లారీకి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు దండుకొంటున్నారు. డబ్బులు ఎక్కువ ఇస్తే వీడియో కాల్‌లో వాహనాన్ని చూసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వెళితే ముందుగా కౌంటర్‌ వేసి ప్రాసెస్‌ను ప్రారంభిస్తారు. కౌంటర్‌ వేయడానికి డీటీఓ సంతకం చేయాలి. ఇక్కడి నుంచే వసూళ్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆర్డర్‌కు రూ.1,000, కౌంటర్‌కు రూ.300, ఏఓకు రూ.500, వాహనాన్ని చెక్‌ చేసే ఇన్‌స్పెక్టర్‌కు రూ.600, వాహనం చూపించిన కానిస్టేబుల్‌కు రూ.200 ఇవ్వాల్సిందే. వ్యవసాయ ట్రాక్టర్‌ రిజిస్ట్రేషన్‌కు రూ.1,500 రుసుం చెల్లించాలి. కానీ రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే కొర్రీలు పెట్టి తిప్పి పంపుతున్నారు.

జిల్లాలో మూడు చోట్ల(వికారాబాద్‌, పరిగి, తాండూరు) ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. పరిగిలో మాత్రమే టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ ఉంది. వికారాబాద్‌, తాండూరులో బహిరంగ ప్రదేశాల్లో డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహించి లైసెన్సులు జారీ చేస్తున్నారు. దీంతో వచ్చీరాని డ్రైవింగ్‌తో పలువురు రోడ్లపైకి వాహనాలతో వచ్చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1.3లక్షల వాహనాలు ఉండగా ఏటా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది.

ప్రభుత్వ నిబంధనల మేరకే ఆర్టీఏ సేవలు అందేలా చూస్తున్నాం. రైతు పేరిట ట్రాక్టర్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలంటే కచ్చితంగా సదరు వ్యక్తి పేరిట భూమి ఉండాలి. కుటుంబ సభ్యుల పేరిట భూమి ఉంటే రిజిస్ట్రేషన్‌ చేయడం సాధ్యం కాదు. ఆర్టీఏ సేవల కోసం ఎవరూ బ్రోకర్ల వద్దకు వెళ్లరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుసుం చెల్లించి సేవలు పొందాలి.

– సుభాష్‌రెడ్డి, డీటీఓ, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement