అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
కొడంగల్: దుద్యాల మండలం హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం వివిధ విద్యాలయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవసరం అయితే కూలీల సంఖ్యను పెంచుకొని సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ హబ్ అధికారులు షఫీ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
● ముగ్గురు రైతులకు నష్టం
● అధికారుల దర్యాప్తులో వెలుగులోకి
యాలాల: మండలంలోని రాస్నం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. రైతులు విక్రయించిన ధాన్యం డబ్బులు వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ధాన్యం సొమ్ము దారి మళ్లిందా? అనే శీర్షిక కథనం ప్రచురితమైంది. డీఆర్‌డీఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, సీసీ శ్రీశైలం, అకౌంటెంట్ చిరంజీవి గ్రామంలో విచారణ చేపట్టారు. ఆరుగురు రైతులు తమ ధాన్యం డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి జమ అయ్యాయని చేసిన నేపథ్యంలో కేంద్ర నిర్వాహకులు, వీఓఏను విచారించారు. ముగ్గురు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బిల్లుల చెల్లింపులకు సంబంధించి గ్రామ వీఓఏ ఓపీఎంఎస్ సైట్‌లో సకాలంలో నమోదు చేయకపోవడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. గడువు ముగిసిపోవడంతో ఓపీఎంఎస్ సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసింది. దీంతో బాధిత రైతులకు సంబంధించి సుమారు రూ.2 లక్షలకు పైగా ధాన్యం డబ్బులు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, వీఓఏలు చెల్లించాల్సి ఉంటుందని ఏపీఎం శ్రీనివాస్ తెలిపారు. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి ఆదేశాల మేరకు సిబ్బందిపై చర్యలు ఉంటాయని ఏపీఎం తెలిపారు.
కొడంగల్ రూరల్: పట్టణ పరిధి ఉడిమేశ్వరం గేటు సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ బీ రామదాసు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 9.30 నుంచి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. బాలుర విభాగంలో ఎంపీసీలో ఎస్సీ 8, మైనారిటీ 1 మొత్తం 9 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. బైపీసీలో ఎస్సీ 1, ఎస్టీ 1, ఓసీ 1, మైనారిటీ 1 మొత్తం నాలుగు సీట్ల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2025 – 26 విద్యా సంవత్సంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, బోనాఫైడ్, కుల, ఆదాయ ధ్రువ పత్రాలతో ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని తెలిపారు.
కొడంగల్: మండలంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు నిండుగా ప్రవహించాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరింది. కుండపోత వానకు కంది, పత్తి, మినుము, పెసర పంట పొలాల్లో నీరు నిలిచింది. కొడంగల్, హస్నాబాద్, పెద్ద నందిగామ, పర్సాపూర్, అంగడిరాయిచూర్ నోటీఫైడ్ చెరువుల్లోకి నీరు చేరింది. చిట్లపల్లి నుంచి ఖాజాఅహ్మద్‌పల్లి, అన్నారం వెళ్లే దారిలో వాగు రోడ్డుపై నుంచి పొంగి ప్రవహించింది. ఖాజాఅహ్మద్‌పల్లి గ్రామస్తులకు రాకపోకలు నిలిచాయి. అంగడిరాయిచూర్ వాగు నిండుగా ప్రవహించింది.


