అనంతగిరి: వికారాబాద్‌లో నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఓ భూ పరిహారం కేసు సంచలన మలుపు తిరిగింది. బాధిత రైతు శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రైతుకు చెల్లించాల్సిన రూ.61.29 లక్షల పరిహారం అందించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన వికారాబాద్ సీనియర్ సివిల్ కోర్టు ఏకంగా ఆర్‌డీఓ కార్యాలయంలోని చరాస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్టు కార్యాలయానికి చేరుకుని జప్తు ప్రక్రియ చేపట్టి జప్తు వస్తువులను తిరిగి కార్యాలయ కస్టడీకి అప్పగించారని తెలిపారు. కాగా అధికారులు మరింత గడువు కావాలని కోరడంతోపాటు విషయాన్ని ఉన్నతాధికారులకు, రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 1986– 87 సంవత్సంలో పట్టణంలోని రైల్వే లైన్ కోసం రైతు శశాకాంక్‌రెడ్డి కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పట్లో గజానికి రూ.50 మాత్రమే పరిహారం నిర్ణయించారు. దీనిపై బాధిత రైతు కోర్టును ఆశ్రయించగా ఇటు బాధితుడు అటు ప్రభుత్వం మధ్య జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం కొనసాగింది. చివరికి గజానికి రూ.125 చొప్పున పరిహారం పొందే హక్కును బాధిత రైతు సాధించుకున్నారు. ఈ విషయంలో 2018లో పరిహారం కోసం సీనియర్ సివిల్ కోర్టులో ఈపీ దాఖలుచేశారు. కాగా సంవత్సరం క్రితం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కార్యాలయాలనికి వచ్చినపుడల్లా అధికారులు గడువు కోరుతున్నారని, పరిహారం ఇవ్వడం లేదని రైతు శశాంక్‌రెడ్డి తెలిపారు.
వికారాబాద్ సీనియర్‌సివిల్ కోర్టు ఆదేశం
భూనిర్వాసితుడికి పరిహారం చెల్లింపులో జాప్యంపై అసంతృప్తి


