దోమ: నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని ఎంపీడీఓ గ్యామా, వ్యవసాయాధికారి ప్రభాకర్ రావు, డీటీ నర్సింలు హెచ్చరించారు. మంగళవారం వారు మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నకిలీ ఎరువులు విక్రయించేందుకు యత్నిస్తే ఉపేక్షించమన్నారు. ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన ఎరువులు, డీఏపీలు, విత్తనాలను మాత్రమే అందించాలని సూచించారు. ఈ కారక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
మోమిన్‌పేట: ఇరవై ఏళ్లుగా ఉపాధి హామీ (వీబీజీరామ్‌జీ) పథకంలో పనిచేస్తున్న తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పథకం సిబ్బంది కోరారు. ఈ మేరకు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది, ఫీల్డ్‌అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల విక్రయాలకు ‘ఎఫ్‌ఎఫ్‌ఎస్’
వ్యవసాయ శాఖ ఏడీఏ అరుణ
తాండూరు రూరల్: ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన యాప్ వ్యవస్థను ప్రకటించిందని వ్యవసాయ శాఖ తాండూరు డివిజన్ ఏడీఏ అరుణ అన్నారు మంగళవారం ఆమె తన విలేకరులతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) యాప్‌ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం(6వ తేదీ)నుంచి అమలులోకి వస్తోందని తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రస్తుతం అమలులో ఉన్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు ప్రభుత్వం నిలిపివేయనుందన్నారు. నూతన యాప్ ద్వారా రైతులు తమ ఆధార్ ఆధారిత ధృవీకరణతో సులభంగా ఎరువులు పొందవచ్చన్నారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానం ద్వారా మీ సేవా కేంద్రాల్లోనూ ఎరువులు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ప్రతీ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యాజమాన్యం స్వచ్ఛందంగా సేవకులను నియామించాలని ఆదేశించారు.
నేడు బంట్వారానికి
స్పీకర్ ప్రసాద్‌కుమార్
బంట్వారం: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే సర్వసభ్య సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఎంపీడీఓ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధి కారులు సకాలంలో హాజరు కావాలన్నారు. మండల అభివృద్ధిపై సమీక్ష ఉంటుందన్నారు.
కోట్‌పల్లిలో..
కోట్‌పల్లి మండల సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్న 2.30 గంటలకు ఉంటుందని ఎంపీడీఓ హేమంత్ తెలిపారు. ముఖ్య అతిథిగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ హాజరవుతారన్నారు. సర్పంచ్‌లు, అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.
టీచర్ డిప్యూటేషన్
రద్దుకు వినతి
తాండూరు రూరల్: మండల పరిధిలోని సంగెంకలాన్ ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న టీచర్ నాగలక్ష్మి డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని గ్రామ సర్పంచు మీనాక్షి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్, డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ– కర్ణాటక సరిహద్దులోని తమ గ్రామంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈసమయంలో ఎలాంటి సమాచారం లేకుండా నాగలక్ష్మి అనే ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్‌పై దోమ మండలానికి పంపించారని తెలిపారు. వెంటనే ఆమె డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని లేదంటే మరొకరినైనా నియమించాలని కోరారు.


