● ఎకరాకు రూ.8 వేల సబ్సిడీ
● రైతులు ముందుకు రావాలి
● జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్
అనంతగిరి: ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వాము సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి ఎంఏ సత్తార్ మంగళవారం తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వస్తే ఎకరాకు ప్రభుత్వం రూ.8వేల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. వాము పంటకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఔషధ, మసాలా పరిశ్రమలు పంట దిగుబడిని కొంటాయని తెలిపారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి అవసరంతో పంట చేతికి వస్తుందని, అధిక ఆదాయం పొందచ్చని తెలిపారు. ప్రస్తుతం సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద వాము సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున, గరిష్టంగా 5 ఎకరాల వరకు ఆర్థిక సహాయం అందించనున్నుట్ల వివరించారు. వాము సాగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తక్కువ నీటితో పంట చేతికొస్తుందన్నారు. స్వల్ప కాల వ్యవధిలో (120 – 150 రోజులు) పంట కోతకు వస్తుంది. ఔషధ, మసాలా పరిశ్రమల్లో డిమాండ్ ఉంటుంది. నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు అనుకూల ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. వర్షాధార ప్రాంతాల్లో కూడా విజయవంతంగా సాగు చేయవచ్చు. పంటల మార్పిడి విధానంలో అనుకూలమైన పంట.
సాగు విధానం
● నీటి పారుదల కలిగిన ఎర్ర నేలలు, ఇసుక, మిశ్రమ నేలలు అనుకూలం
● ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విత్తడం ఉత్తమం
● ఎకరాకు సుమారు 2.5 కిలోల నాణ్యమైన విత్తనం అవసరం
● వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 –15 సెం.మీ. దూరం పాటించాలి.
● భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి.
● ప్రారంభ దశలో కలుపు నివారణ, అవసరమైన సమయంలో తేలిక పాటి నీటి పారుదల కల్పించాలి.
● సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులను అ నుసరిస్తే మంచి దిగుబడి, నాణ్యత లభిస్తుంది.
● గత సంవత్సరం ఈ పథకం కింద వాము సాగుకు సబ్సిడీ పొందిన రైతులు ఈ సంవత్సరం అర్హులు కారు. పరిమిత లక్ష్యాల మేరకు ముందుగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులకు ప్రాధాన్యత కల్పిస్తాం.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
● పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ ఖాతా బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో
● అర్హులైన రైతులు సంబంధించిన మండల ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.


