అనంతగిరి: పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సేవలందించాలని, స్టేషన్‌కు వచ్చే బాధిత మహిళలతో గౌరవంగా వ్యవహరించి ధైర్యం చెప్పాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. సిబ్బంది పనితీరు, కేసుల విచారణ, పురోగతి, బాధిత మహిళలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల్లో వేగం పెంచి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలపై వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులు వంటి ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా, వేగవంతంగా స్పందించాలన్నారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా, నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో ఆలస్యం వహించరాదని, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించడం, పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకట్రాం నాయక్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్‌రోక్తా దివస్ కార్యక్రమంలో భాగగా జిల్లా వ్యాప్తంగా అన్ని పీఎస్‌ల పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ స్నేహమెహ్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పోలీసులు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మార్కెట్ ప్రాంతాలు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు.
ఆకస్మిక తనిఖీ
ఎస్పీ కార్యాలయ ఆవరణలోని డీసీఆర్‌బీ కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేసుల రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల వివరాలు, నేర గణాంకాల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల నమోదు విధానం, రికార్డుల భద్రపరిచే విధానం తదితర అంశాలను పరిశీలించారు.
మహిళల కేసుల్లో సున్నితంగా వ్యవహరించాలి
ఎస్పీ స్నేహ మెహ్ర


