బొంరాస్‌పేట: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షాక్‌కు గురై పాడి ఆవు మృతిచెందిన ఘటన మండలంలోని ఎన్కేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జబ్బార్‌మియా సోమవారం ఉదయం చనిపోయిన ఆవును చూసి బోరుమన్నాడు. పాడి ఆవు మృతితో రూ.60 వేల నష్టం వాటిల్లిందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరాడు.
రుక్కమ్మ అస్తికల నిమజ్జనం
తాండూరు: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సోదరులు సోమవారం కాశీలోని గంగానదిలో తమ తల్లి రుక్కమ్మ అస్తికలను నిమజ్జనం చేశారు. అనంతరం రుక్కమ్మ మనవళ్లు అవినాష్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులతో కలిసి కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు.
యూనిఫాం
మరింత ఆలస్యమే!
తాండూరు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫాంల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. మున్సిపల్ పరిధిలో 33 ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహ విద్యార్థులకు సంబంధించి యూనిఫాం కట్టే బాధ్యతలను మహిళా సమాఖ్య సంఘాలకు అప్పగించారు. 7,224 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,022 మాత్రమే సిద్ధం చేశారు. మరో 12,955 యూనిఫామ్‌లను కుట్టాల్సి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావస్తున్నా యూనిఫామ్‌ల పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మండలంలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరారు. ఈ మేరకు సోమవారం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఓలు, ఈసీలు, టీఏ, సీఓ సమ్మెలో పాల్గొంటే తాము విధుల్లో ఉన్నామని తెలిపారు. సమ్మెతో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు దాన య్య, బాల్‌రాజ్, రామలింగం పాల్గొన్నారు.
చేవెళ్ల: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వడ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తుక్కుగూడలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కులకోసం, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.


