తాండూరు రూరల్: శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఆఖరి మజిలీకి అవస్థలు తప్పడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే అంతిమయాత్ర గగనంగా మారుతోంది. పెద్దేముల్ మండలం తింసాన్‌పల్లి గ్రామ శివారులో పల్లె చెల్మ వాగు ఉంది. దీనికి అవతలి వైపు ఎస్సీ శ్మశానవాటికతో పాటు పలువురు రైతుల వ్యవసాయ పొలాలున్నాయి. వానా కాలం వస్తే తరచూ వాగు పారి అవతలి గట్టుకు వెళ్లే పరిస్థితి ఉండటం లేదు. దీంతో రైతులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు బయల్దేరారు. వాగు వద్ద పారుతున్న నీటిలో నుంచి నడుస్తూనే పాడె మోశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంటే దాటలేని పరిస్థితి ఉంటుందని, ఒక్కోసారి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించి శ్మశానవాటికకు దారి చూపాలని వేడుకున్నారు.
వాగు దాటితేనే
శ్మశానవాటికకు చేరేది
వరద పారితే వెళ్లడం కష్టమే
బ్రిడ్జి నిర్మించాలని
తింసాన్‌పల్లివాసుల వినతి


