దోమ: ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూ సేకరణలో భాగంగా సోమవారం రైతుల పొలాల్లో సర్వే ప్రారంభించారు. మండల పరిధిలోని కొండాయపల్లిలో నలుగురు తహసీల్దార్లతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేస్తున్నారు. పోలీసుల పహారా మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు రోజుల్లో సర్వే పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్డీఓ వాసుచంద్ర, స్థానిక తహసీల్దార్ రవీందర్ సర్వేను పరిశీలించారు. పారదర్శకంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు సర్వేకు సహకరించాలని కోరారు. భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని తెలిపారు. అనంతరం రేడియల్ రోడ్డుకు భూమిని సేకరిస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. బట్లచందారంలో పర్యటించి, భూ నిర్వాసితులతో మాట్లాడారు. పలువురు రైతుల అభిప్రాయాలను సేకరించారు. తగిన పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ వెంకటేశ్, సీనియర్ అసిస్టెంట్ ఫర్వేజ్, సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ వసంత్ జాదవ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాలుగు ప్రత్యేక బృందాలతో
కొనసాగుతున్న పనులు
మూడు రోజుల్లో
పూర్తి చేస్తామంటున్న అధికారులు
కొండాయపల్లి, బట్లచందారంలో
ఆర్డీఓ వాసుచంద్ర పర్యటన


