ధారూరు: ఓ కానిస్టేబుల్ నిర్వాకంతో ఏ తప్పూ చేయని ఓ లారీ డ్రైవర్‌తో పాటు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి సిమెంట్ బస్తాల లోడ్‌తో ఓ లారీ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈసమయంలో బైక్‌పై వెళ్తున్న ఓ మందుబాబు ఫుళ్లుగా తాగి లారీ వెనకాల కొద్ది దూరంలో అదుపు తప్పి పడిపోయాడు. ఇది గమనించి సదరు కానిస్టేబుల్ లారీ ఢీకొట్టడంతోనే వాహనదారుడు పడిపోయాడంటూ డ్రైవర్‌ను బెదిరించాడు. ప్రమాదానికి కారణం తాను కాదని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. ప్రమాదానికి గురైన వ్యక్తి వచ్చి తానే పడిపోయానని, ఇందులో లారీ డ్రైవర్ తప్పేమీ లేదని చెప్పినా కానిస్టేబుల్ వినిపించుకోలేదు. లారీని పీఎస్‌కు తీసుకురావాలని ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక స్టేషన్‌కు బయల్దేరాడు. పీఎస్ పక్కన ఉన్న పొలంలో లారీని పార్క్ చేయమని కానిస్టేబుల్ ఆదేశించడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు కిందకు దించగానే అక్కడే దిగబడిపోయింది. దీంతో 18గంటల పాటు డ్రైవర్ ఇక్కడే ఇరుక్కుపోయాడు. సంచులను కిందికి దింపి, లారీని బయటకు లాగిన అనంతరం మళ్లీ లోడ్ చేయించుకుని సోమవారం సాయంత్రం ఉసూరుమంటూ వెళ్లిపోయాడు. తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పినా కానిస్టేబుల్ పట్టించుకోలేదని వాపోయాడు. ఉద్దేశపూర్వకంగానే లారీ డ్రైవర్‌ను ఇబ్బంది పెట్టాడని పలువురు వాహనదారులు తెలిపారు.


