నమ్మించి.. మోసగించి | - | Sakshi
Sakshi News home page

నమ్మించి.. మోసగించి

Jul 27 2026 7:26 AM | Updated on Jul 27 2026 7:26 AM

వెలుగులోకి ఇలా

పరిగి: నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్న అధికార యంత్రాంగం మాటలు నీటి మీద రాతలుగా మారాయి. మరోవైపు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రైతుల పరిస్థితి దాపురించింది. అసలే వర్షాభావ పరిస్థితులకు విలవిలలాడుతున్న సమయంలో నకిలీ డీఏపీ వ్యవహారం కలకలం రేపుతోంది. పూడూరు, పరిగి మండలాల్లో నకిలీ ఎరువులతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్‌ కన్నా తక్కువ ధరలకు ఎరువులను విక్రయిస్తుండటంతో ఎగబడి కొనుగోలు చేశారు. ఇప్పుడవి నకిలీవని ప్రచారం జరుగుతుండడంతో అయోమయంలో పడ్డారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు డీఏపీకి డిమాండ్‌ పెరిగింది. డీలర్లు కూడా ప్రభుత్వం అందించాల్సిన ధర బస్తాకు రూ.1,350 కాకుండా రూ.1,800 విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా కేటుగాళ్లు నేరుగా కంపెనీ నుంచి వచ్చి విక్రయిస్తున్నామని నమ్మించి మార్కెట్‌లో దొరికే హోలోగ్రామం ఉన్న బస్తాలను రూ.1,700 చొప్పున రైతులకు విక్రయించారు.

అధికారుల కనుసన్నల్లోనే!

ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ డీఏపీని కొనుగోలు చేసి గ్రామాల్లోని రైతులకు మధ్యవర్తుల ద్వారా విక్రయించారు. వారం పది రోజుల పాటు ఎలాంటి అనుమతులు లేకుండా దళారులు డీఏపీ విక్రయిస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా జరిగిందని పలువురు రైతులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిగి చర్యలు తీసుకోవాలని ఆరుగాలం శ్రమించే అన్నదాతలు కోరుతున్నారు.

గ్రామాల్లో నకిలీ డీఏపీ కలకలం

పరిగి, పూడూరు మండలాల్లో వెలుగులోకి దందా

వేల బస్తాలు రైతులకు విక్రయించినట్లు అనుమానాలు

పట్టించుకోని వ్యవసాయ అధికారులు

మార్కెట్‌ కన్నా తక్కువ ధరకు, నేరుగా ఇంటికే డీఏపీ ఎరువు వస్తుందని రైతులు సంబరపడ్డారు. తీసుకొని పంటకు వేస్తుండగా.. చేతులకు బొబ్బలు రావడం, నీటిలో కరగకపోవడంతో ఖంగుతిన్నారు. ఇదీ పరిగి, పూడూరు మండలాల్లో కొంతమంది రైతుల పరిస్థితి.

పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత వారం రోజులుగా సుమారు 500 బస్తాల నకిలీ డీఏపీ ఎరువును విక్రయించినట్లు సమాచారం. ఇదే వ్యక్తి పరిగి మండలం చిగురాల్‌పల్లిలో 200 బస్తాలు, బసిరెడ్డిపల్లిలో 100 బస్తాలు, కల్నాపూర్‌లో సుమారు 350 బస్తాల వరకు విక్రయించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాల్లో డీఏపీ ఎరువును వేస్తున్న సమయంలో కొందరి చేతులకు బొబ్బలు వచ్చాయి. అలాగే డీఏపీ నీటిలో కరగకపోవడంతో అది నకిలీ ఎరువని రైతులు అనుమానించారు. దీంతో సదరు వ్యక్తిని రైతులు నిలదీయగా, తాను తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు, వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి రావనే భయంతో పలువురు కర్షకులు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement