ఆశగా ఎదురు చూస్తున్న అర్హులు ఆందోళనలో స్థలం లేని పేదలు వేగం పుంజుకున్న మొదటి విడత నిర్మాణాలు
వికారాబాద్: త్వరలో జిల్లాకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్న నేపథ్యంలో అధికారులు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొదటి విడతలో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించని వాటిని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 2,500 ఇళ్ల చొప్పున కొత్తగా మంజూరు కానున్నట్లు సమాచారం. అయితే స్థలాలు ఉన్న వారికే కేటాయించే అవకాశం ఉండటంతో స్థలం లేని పేదల ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మొదటి విడత ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. కలెక్టర్ దీపక్ తివారి ప్రత్యేక చొరవ తీసుకుని నిరంతర సమీక్షలు చేస్తున్నారు. ఆరు నెలలుగా పనులను పరుగులు పెట్టిస్తున్నారు. హౌసింగ్ శాఖలో ఇంజనీర్ల కొరత కారణంగా కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఇంజనీర్లను ఎంపిక చేసి వారి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన వారంలోపే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. చివరి బిల్లు మాత్రం కాస్త ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. మున్సిపల్ కేంద్రాల్లో త్వరిత గతిన బిల్లులు మంజూరవుతున్నట్లు సమాచారం.
ఆయా దశల్లో ఉన్న ఇళ్లు
మొదటి విడతలో 12,628 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అనుమతి పత్రాలు అందజేశారు. 9,093 ఇళ్లకు మార్కింగ్ కూడా ఇచ్చారు. ఇందులో 1,732 ఇళ్లు పునాది వరకు పూర్తి కాగా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున విడుదల చేశారు. మరో 939 ఇళ్లు శ్లాబ్ వరకు, మరో 3,256 ఇళ్లు రూప్ కాస్ట్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. వీరికి రూ.4 లక్షల చొప్పున చెల్లించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,840 మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా 249 మందికి రూ.5 లక్షల చొప్పున ఫైనల్ బిల్లు చెల్లించారు. మిగిలిన వారికి చెల్లించాల్సి ఉంది. ఆయా దశలను బట్టి 9,093 ఇళ్లకు రూ.189.43 కోట్లు విడుదల చేశారు. 3,535 మంది ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. వాటిని రద్దు చేసి రెండో విడతలో కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు.
స్వల్ప మార్పులతో..
మొదటి విడతలో ఎదురైన ఇబ్బందులనుదృష్టిలో ఉంచుకొని అధికారులు రెండో విడతలో స్వల్ప మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇళ్లు ఉండి పైకప్పు దెబ్బతిన్న వాటికి పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కో నియోజకవర్గంలో 500 ఇళ్లను గుర్తించి పైకప్పు మాత్రమే నిర్మించుకునే వారికి రూ.2 లక్షల చొప్పున బిల్లులు చెల్లించాలని భావిస్తున్నారు. మొదటి విడతలో 400 నుంచి 600 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఇల్లు నిర్మించుకోవాలనే నిబంధన ఉండేది. దీన్ని 750 ఎస్‌ఎఫ్‌టీ వరకు సడలించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తమకు కూడా అవకాశం కల్పించాలని స్థలాలు లేని పేదలు కోరుతున్నారు.
త్వరలో జిల్లాకు రెండో విడత ఇళ్లు
మొదటి విడతలో ఇలా..
జిల్లాకు కేటాయించిన ఇళ్లు 12,628
పూర్తయినవి 1,840
ఆయా దశల్లో ఉన్నవి 9,093
ఇంకా ప్రారంభం కానివి 3,535
ఇప్పటి వరకు లబ్ధిదారులకు చెల్లించిన
మొత్తం రూ.189.43 కోట్లు


