అనంతగిరి: కేసుల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఎస్పీ స్నేహ మెహ్ర సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నేర నియంత్రణ, పెండింగ్ కేసులపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నేరాల స్వరూపం వేగంగా మారుతున్నందున సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన అవసరమన్నారు. నేరస్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్‌ను విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో సీడీఆర్, ఎల్పీడీఆర్, టవర్ డంప్ డేటా విశ్లేషణతో పాటు సోషల్ మీడియా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సమర్థవంతమైన శోధన ద్వారా కీలక ఆధారాలను సేకరించి కేసులను త్వరితగతిన ఛేదించవచ్చని తెలిపారు. పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సాంకేతిక ఆధారాలను వినియోగించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్సీ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్గా, ఐటీ సెల్ ఎస్‌ఐ శంకర్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


