నీరీక్షిస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

నీరీక్షిస్తున్నారు!

Jul 17 2026 7:27 AM | Updated on Jul 17 2026 7:27 AM

వాడిపోతున్న పత్తి, ఇతర పంటలు పాతాళానికి భూగర్భ జలాలు కమ్ముకొస్తున్న కరువుఛాయలు ఆకాశంకేసి ఆశగా చూస్తున్న రైతులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: వికారాబాద్‌ జిల్లాలో జూన్‌ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 185.0 మి.మీటర్ల వర్షపాతం కురువాల్సి ఉండగా, 114.1 మి.మీటర్లు మాత్రమే నమోదైంది. ఐదు మండలాల్లో అధిక లోటు, పది మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కుల్కచర్ల, బంట్వారం, బషీరాబాద్‌, పెద్దేముల్‌, కొడంగల్‌ మండలాల్లో సాధారణం కంటే 60 నుంచి 99 శాతం తక్కువ నమోదైంది. ఈ మండ లాల్లో కరువు తాండవిస్తోంది. మర్పల్లి, నవాబుపేట, పరిగి, దోమ, ధారూరు, కోట్‌పల్లి, తాండూరు, యాలాల, దౌల్తాబాద్‌ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 4,85,849 ఎకరాల పంటసాగు విస్తీర్ణం ఉండగా, ఇప్పటి వరకు 3,19,039 ఎకరాల్లో మాత్రమే సాగైంది. 2,08,147 ఎకరాల్లో పత్తి, 80,502 ఎకరాల్లో కంది, 21,704 ఎకరాల్లో మొక్కజొన్న, 2,296 ఎకరాల్లో పెసర, 163 ఎకరాల్లో జొన్న, 723 ఎకరాల్లో మినుము, 930 ఎకరాల్లో సోయాబీన్‌, 1,874 ఎకరాల్లో ఇతర పంటలు సాగైనట్లు జిల్లా వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్లు సమాచారం. చాలా చోట్ల మొలకెత్తిన విత్తనాలు ఎండకు వాడిపోయాయి. ఏపుగా పెరగాల్సిన మొక్కలు కళ్లముందే వాడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకో వాలని కోరుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో 5.06 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. వీటిలో 1.62లక్షల ఎకరాల్లో వరి, 1.94లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా. ఈ ఏడాది ఇప్పటి వరకు సగం భూమిలో కూడా పంటలు వేయలేదు. ఈ ఏడాది ఎల్‌నినో ఎఫెక్ట్‌ ఉందని, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణశాఖ పదేపదే చెబుతున్నప్పటికీ.. వ్యవసాయశాఖ అధికారులు మా త్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. రైతుల దృష్టిని ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించలేకపోయారు. ఆన్‌లైన్‌లో పంట వివరాల నమోదు, ఫెర్టిలైజర్స్‌ బుకింగ్స్‌కే పరిమితమవుతున్నారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి గ్రామానికి ఒక రైతు వేదికను ఏర్పాటు చేసినా.. అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కడ్తాల్‌, కందుకూరు, మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, షాద్‌నగర్‌, కేశంపేట తదితర మండలాల్లో పంటలు వాడిపోయి కన్పిస్తున్నాయి.

పాతాళానికి చేరిన గంగమ్మ

మెజార్టీ మండలాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారా యి.వర్షపు చినుకు కురిసినా భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి లేదు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగం అధికమైంది. భూమిలోకి ఇంకే నీటి శాతంతో పోలిస్తే మోటార్ల ద్వారా బయటికి తోడేస్తున్న జలాలే అధికం. ఫలితంగా భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. మే నెలతో పోలీస్తే జూన్‌లో మరింత లోతుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరూర్‌నగర్‌లో అత్య ధికంగా 29.72 మీటర్ల లోతుకు,అబ్దుల్లాపూర్‌ మెట్‌ 19.29 మీటర్లు, శంకర్‌పల్లి 16.88 మీటర్లు, కడ్తాల్‌ 15.51 మీటర్లు, చౌదరిగూడెం 15.18 మీటర్లు, షాబాద్‌ 13.75 మీటర్లు, ఇబ్రహీంపట్నం 13.63 మీటర్లు, చేవెళ్ల, తలకొండపల్లి 13.26 మీటర్లు, మహేశ్వరంలో 12.77 మీటర్ల లోతుకు పడిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే మెజార్టీ బోర్లు పని చేయడం లేదు. దీంతో ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉస్మాన్‌సాగర్‌, హియాయత్‌సాగర్‌ ఎగువన ఉన్న మూసీ, ఈసీ వాగుల సమీపంలోని వ్యవసాయ భూముల్లోనే కాదు దిగువన ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీగా బోర్లు వేసి నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు.

ముఖం చాటేసిన వరుణుడు

కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. మృగశిర, ఆరుద్ర కార్తెలు దాటినా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. తొలకరికి వేసిన పంటలు నీరు లేక వాడిపోతున్నాయి. ఏపుగా పెరిగి, గూడ, పూత దశకు చేరుకోవాల్సిన పత్తి మొక్కలు ఇప్పటికీ నేల చూపులు చూస్తున్నాయి. మృగశిర రోజు నారు పోసిన కొంతమంది రైతులు.. నీరు లేకపోవడంతో ఇప్పటికీ పొలాలు దున్నలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement