ఎంపీ డీకే అరుణను కోరిన
బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణ
దుద్యాల్: మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీ డీకే అరుణను బీజేపీ మండల అధ్యక్షుడు పుర్ర నారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కోరారు. గురువారం మహబూబ్‌నగర్‌లో ఆమెను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నందున వాటి పరిష్కారానికి నిధులు కేటాయించాలని ఎంపీని కోరినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. హకీంపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిబ్బంది కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చి నట్లు వివరించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
బషీరాబాద్: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బాబునాయక్ తండా లో గురువారం చోటు చేసుకుంది.పోలీసు లు,స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు జెర్పుల రాములు నాయక్(51) ఉదయం పొలంలో బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంతో ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ వైర్ తగిలి పడిపోయాడు. గమనించి న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాములు నాయక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య సుశీలబాయి, కుమారులు బాబు, నితిన్, కుమార్తె భూమిక ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరు జిల్లాఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
యాచారం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సర్కార్ దృష్టి సారించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ అన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా గురువా రం మొండిగౌరెల్లి, నల్లవెల్లి, మాల్, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు, పెండింగ్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. పీఆర్సీ తక్షణమే ప్రకటించాలని, పదోన్నతులు, బదిలీలను వెంటనే చేపట్టాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తు పాండురంగారెడ్డి, నాయకులు చారి, నరేందర్‌రెడ్డి, లక్‌పతి, బాలకృష్ణ, లింగం తదితరులు పాల్గొన్నారు.


