పంట నష్టంపై నివేదిక ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

పంట నష్టంపై నివేదిక ఇవ్వండి

Jul 17 2026 7:27 AM | Updated on Jul 17 2026 7:27 AM

● కలెక్టర్‌ దీపక్‌ తివారి ● మండలంలో కంది, మొక్కజొన్న, ఆయిల్‌ పామ్‌ తోటల పరిశీలన

ధారూరు: వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలో ఎంతమేర పంటలు దెబ్బతిన్నాయి.. రైతులకు జరిగిన నష్టం ఎంత అనే దాని పై పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ దీపక్‌తివారి జిల్లా వ్యవసాయాధికారి కవితకు సూచించారు. గురువారం ధారూరు జీపీలో సర్‌ ప్రక్రియను పరిశీలించి బీఎల్‌ఓలు కవిత, రమాదేవికి పలు సూచనలు చేశారు. ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గ్రంథాలయ ఆవరణలో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. స్కూల్‌ యూనిఫాం కుట్టు కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులకు వీలైనంత త్వరగా యూనిఫాం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం గ్రామ సమీపంలోని కంది, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వర్షాలు పడనందున ప్రత్యామ్నాయ పంటలు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అంతకుముందు తరిగోపుల గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆయిల్‌ పామ్‌ తోటలను పరిశీలించి రైతులకు ఆధునిక సాంకేతికతను అందించాలని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను రైతులకు వివరించి సాగును ప్రోత్సహించాలన్నారు. ధారూరు బస్టాండ్‌ నుంచి బాలికల ఉన్నత పాఠశాల వరకు డబుల్‌ సీసీ రోడ్డు నిర్మించాలని, జీపీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ ప్రమీలగౌడ్‌ కలెక్టర్‌ను కోరారు. యాప్‌లో యూరియా, డీఏపీ బుక్‌ చేసుకోవడం తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని ఆసరగా చేసుకుని ఫెర్టిలైజర్‌ దుకాణ యజమానులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని అవుసుపల్లికి చెందిన రైతు నర్సింహులు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌ యూనియా బుక్‌ చేసుకునేందుకు ఏఈఓల సహకారం తీసుకోవాలన్నారు. వర్షాలు పడకపోవడంతో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధారూరును కరువు మండలంగా ప్రకటించాలని డీసీసీ కార్యదర్శి బాబాఖాన్‌ కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ట్రైయినీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌, డీఆర్‌ఓ స్వర్ణలత, డీహెచ్‌ఎస్‌ఓ సత్తార్‌, తహసీల్దార్‌ సాజిదాబేగం తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా చేపట్టాలి

అనంతగిరి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్‌ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. బూత్‌ లెవల్‌ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, డీఆర్‌ఓ స్వర్ణలత, ఆర్‌డీఓ వాసుచంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో..

పంట సాగు, వర్షపాతం, విత్తనాల లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు గురువారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వాతావరణ మార్పులు, సాగు, విద్యారంగం, తాగునీరు తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ట్రైయినీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుట్టుర్‌, జెడ్పీ సీఈఓ సుధీర్‌, జిల్లా వ్యవసాయాధికారి కవిత, డీఎంహెచ్‌ఓ సుధాకర్‌ లాల్‌, డీపీఓ జయసుధ, ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, మిషన్‌ భగీరథ ఈఈ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement