వికారాబాద్: నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం కేంద్రాల్లో హాల్ టికెట్ నంబర్లు వేశారు. విద్యార్థులు గంట ముందుగా సెంటర్లకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఎగ్జామ్ సెంటర్ల సమీపంలోని జిరాక్స్ షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల్లో తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నెలరోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,852 మంది బాలురు, 6,691 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధాహ్నం 12:30 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. అనుకోని పరిస్థితుల కారణంగా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
మాస్ కాపీయింగ్ కట్టడికి చర్యలు
మాస్ కాపీయింగ్ కట్టడికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎవరైనా చూసి రాస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులు చేయాలని నిర్ణయించారు. 2023లో మాస్ కాపీయింగ్, ఉపాధ్యాయుల ప్రమేయంపై గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. 72 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 20 మంది తహసీల్దార్లు, 20 మంది ఎంపీడీఓలు 20 మంది ఎంఈఓలు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల రవాణా కోసం ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు.
గడిచిన ఐదేళ్లుగా నిరాశపర్చిన పదో తరగతి ఫలితాలు.. గత రెండేళ్లలో జిల్లాను అట్టడుగు స్థానాలకు తీసుకెళ్లాయి. దీంతో ఈసారి ఎలాగైనా మంచి రిజల్ట్ సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వెనుకబడిన వారిపై దృష్టిసారించి, పరీక్షలకు సన్నద్ధం చేశారు.
నేటి నుంచిపదో తరగతి వార్షిక పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లాలో మొత్తం విద్యార్థులు 13,579 మంది
పరీక్ష కేంద్రాలు 69
ఐదు నిమిషాలలోపు
ఆలస్యమైనా అనుమతి
పరీక్షలు సజావుగా జరగాలి
డీఈఓ రేణుకాదేవి
కొడంగల్ రూరల్: పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని డీఈఓ రేణుకాదేవి ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ నుంచి అన్ని కేంద్రాల ఇన్విజిలేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం జాక వెంకటేశం, ఉపాధ్యాయ సిబ్బంది, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు. అనంతరం ఎంఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ మండలంలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 1,003మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు.


