మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్
● సకాలంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలి
● ప్రభుత్వ ధరలకే విక్రయించాలి
● కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ దీపక్‌తివాలి ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీని సందర్శించారు. బుకింగ్ విధానం, అవలంబిస్తున్న పద్ధతులు, రికార్డుల నిర్వహణ తదితర వాటిని పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. సంబంధత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కృత్రియ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సకాలంలో గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు. అనంతరం పట్టణంలోని సివిల్ సప్లయ్ గోదాంను తనిఖీ చేశారు. పౌరసేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. స్టాక్, రికార్డులను పరిశీలించారు. సన్నబియ్యం, ఇతర సరుకులు లబ్ధిదారులకు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం మురళీ కృష్ణ, డీఎస్‌ఓ సుదర్శన్, తహసీల్దార్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీ
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, దుకాణ లైసెన్సులను పరిశీలించారు. ఎంఆర్‌పీకే ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ రాజరత్నం, ఏడీఏ సందీప్‌కుమార్, ఏఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఏజెంట్లను నియమించాలి
అనంతగిరి: బూత్‌స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నిక అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు మ్యాపింగ్, బూత్‌స్థాయి అధికారుల, ఏజెంట్ల నియామకంపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 68.30శాతం ఓటరు మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్‌ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వేగవంతం చేయాలి
ఏప్రిల్ 20లోపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 12,863 ఇళ్లు మంజూరయ్యాయని, 8,546 నిర్మాణాలు ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా వాప్తంగా 621మంది గుడిసెల్లో ఉన్నారని వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీపీఓ జయసుధ, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సురేష్, హౌసింగ్ పీడీ సయ్యద్ మొక్రం బాబా పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో శుక్రవారం నగరం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు సూచించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్ రాజేశ్వరి, సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్, డీసీఎస్ మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సత్తార్, ఇరిగేషన్, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.


