జాతర గుర్తుండిపోవాలి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి కలెక్టర్ ప్రతీక్ జైన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం: ఎస్పీ స్నేహమెహ్ర పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకున్న అధికారులు రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
దుద్యాల్: మండలంలోని పోలేపల్లిలో స్వయంభూగా వెలిసిన రేణుకా ఎల్లమ్మ జాతర ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం ఆలయ అతిథి గృహంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రతీక్‌జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వారం రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. లక్షకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు సిబ్బంది అందుబాటు ఉండాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. జాతరకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏయే ప్రాంతంలో ఏయే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు స్థలాలు కేటాయించాలని తెలిపారు. అమ్మవారి దర్శనానికి ఇబ్బంది కలగకుండా క్యూలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొబైల్ టాయిలెట్స్, మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. అనంతరం అధికారులు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ జైపాల్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీధర్ రెడ్డి, ఆలయ ఈవో రాజేందర్ రెడ్డి, చైర్మన్ ముచ్చటి వెంకటేశ్, డీపీఓ జయసుధ, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, ఎస్‌ఐ శ్రీశైలం, ఎంపీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సర్పంచ్ చంద్రయ్య, యాదవ సంఘం మండల అధ్యక్షుడు నర్సింలు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకుంటున్న కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు
హాజరైన అధికారులు
జాతర గుర్తుండిపోవాలి
జాతర గుర్తుండిపోవాలి


