పేదల గోడు.. పెద్దలకు పట్టదా?
మంచాల: ప్రాణాలు పోతున్నా మా గోడు పట్టించుకోరా.. అంటూ డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులు బోరున విలపిస్తున్నారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. మండలంలోని లింగంపల్లి గేట్ వద్ద నోముల రెవెన్యూ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో 96 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. మంచాల, నోముల, లింగంపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 30 చొప్పున కేటాయించారు. మరో ఐదు ఇళ్లను రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ఇచ్చారు. మిగిలిన ఒక ఇల్లును స్థలం ఇచ్చిన రైతుకు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినా చిన్న చిన్న సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు. గతేడాది జూన్‌లో వసతులు కల్పించి ఇళ్లను తమకు అప్పగించాలని ఆయా గ్రామాల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వారితో మాట్లాడి పూర్తి స్థాయిలో పనులు చేశాక తప్పక ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ మరుసటి రోజే ఎన్ని రోజులు ఎదురు చూడాలంటూ లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లారు.
పరిసరాలు అధ్వానం
డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లి నేటికి ఆరు నెలలు దాటినా పట్టించుకునే నాథుడు లేడు. చీకట్లోనే ఉంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇళ్ల చుట్టూ చెట్లు పెరిగి ప్రమాదకరంగా మారింది. దీంతోపాటు విష సర్పాలు వస్తున్నాయని వాపోతున్నారు. నీటి వసతి సైతం సరిగా లేదు. ట్యాంకులు సైతం ఏర్పాటు చేయలేదు. తమకు డబుల్ బెడ్‌రూం రావడంతో గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సంబంధిత తహసీల్దార్ ఎం.వీ.ప్రసాద్‌ను వివరణ కోరగా.. కచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది. ఎప్పుడు ఇస్తారనేది స్పష్టత రాలేదని తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు
కనీస వసతులకు నోచుకోని డబుల్ బెడ్ రూం ఇళ్లు
ఎన్నిసార్లు వినతులిచ్చినా ఫలితం లేదని ఆవేదన
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు
పట్టించుకోవడం లేదు
మేము ఆరు నెలలకు పైగానే ఇక్కడే ఉంటున్నాం. కనీసం పట్టించుకునే నాథుడు లేడు. ఇంటి వద్ద పరిస్థితి బాగా లేకనే ఇక్కడికి వచ్చాం. మౌలిక వసతులు లేని చోట ఎన్ని రోజులు ఉండాలి. దీనిపై ప్రభుత్వమే స్పందించాలి.
– ఏర్పుల ప్రవళిక, మంచాల
చీకట్లో ఉంటున్నాం
ఇక్కడ విద్యుత్ సరఫరా ఉంది. కానీ ఇళ్లలోకి ఇంకా సరఫరా చేయలేదు. మేము చీకట్లోనే కాలం వెల్లదీస్తున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు, ప్రభుత్వం తక్షణమే విద్యుత్ సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలి.
– ఏర్పుల నాగమణి, మంచాల
పాములు వస్తున్నాయి
మా డబుల్‌బెడ్ రూం ఇంటిలోకి విష సర్పం వచ్చింది. చిన్న పిల్లలతో ఉండలేక పోతున్నాం. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి డబుల్ బెడ్ రూం ఇళ్లకు అన్ని వసతులు కల్పించాలి.
– ఎ.యాదగిరి, మంచాల
న్యాయం చేయాలి
అధికారులు వాస్తవాలను పరిశీలన చేసి మానవత్వంతో మాకు న్యాయం చేయాలి. ఇక్కడ డబుల్ బెడ్ రూం కేటాయించారని వచ్చాం. కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. మాకు ఇబ్బందులు లేకుండా అధికారులు న్యాయం చేయాలి.
– ఎండీ షమీమ్, మంచాల


