అక్షరాస్యతతోనే మార్పు సాధ్యం
అనంతగిరి: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని మెప్మా డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ (అర్బన్), ప్రాజెక్ట్ డైరెక్టర్ గుజ్జారి రవి కుమార్ అన్నారు. ఈ మేరకు వికారాబాద్ పట్టణం డైట్ కళాశాల ఆవరణలో మెప్మా మహిళా సమాఖ్య సభ్యులు, ఆర్పీలకు అక్షరాస్యతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాస్యత ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజంలో స్థిరమైన మార్పు సాధ్యమని తెలిపారు. ముఖ్యంగా మహిళల సాధికారత, పెద్దల విద్య, సామాజిక చైతన్యంలో ‘ఉల్లాస్ అక్షరాస్యత’ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఉల్లాస్ జిల్లా అధికారి శ్రీనివాస్‌బాబు మాట్లాడుతూ.. పదిహేనేళ్లు పైబడిన ప్రతీ మహిళను అక్షరాస్యురాలిగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ‘అమ్మకు అక్షర మాల’ కార్యక్రమంలో భాగంగా తొంభై రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. మెప్మా పట్టణ సమన్వయ అధికారి వెంకటేశ్, ఉల్లాస్ అధికారులు బోగేష్, నటరాజు, సరిత, సీఆర్పీలు, మెప్మా ఆర్పీలు మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మెప్మా పీడీ గుజ్జారి రవి


