భూ దోపిడీకి వారసుడొచ్చాడు!
బషీరాబాద్: ఒంటరి వృద్ధురాలి భూమిని కాజేసేందుకు ఓ వ్యక్తి పదేళ్ల క్రితమే పథక రచన చేశాడు. ఆమె బతికుండగానే నకిలీ డెత్ సర్టిఫికెట్ తీసుకొని.. చనిపోయిన తర్వాత మృతురాలి పేరిట ఉన్న భూమిని తన పేరున మార్చుకున్నాడు. ఈ ఘటన బషీరాబాద్ మండలం నావంద్గీ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన దంపతులు కమలమ్మ, యాదయ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. 1978లో సీలింగ్ యాక్ట్ కింద గ్రామ వాసి కరణం నర్సింగావుకు చెందిన (సర్వే నంబర్ 6/17లో..) 15 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులోని 1.04 ఎకరాల అసైన్డ్ భూమి యాదయ్య పేరున ఇచ్చింది. పదిహేను సంవత్సరాల క్రితం యాదయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ భూమిని భార్య కమలమ్మ పేరున మార్చారు. 2024 జనవరి 17న అనారోగ్యంతో ఆమె కూడా చనిపోయింది. ఒంటరి మహిళ కావడంతో అప్పట్లో గ్రామ పంచాయతీ కార్మికులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
పదేళ్ల క్రితం చనిపోయినట్లుగా..
కమలమ్మ భూమిపై ఎప్పటి నుంచో కన్నేసిన గ్రామానికి చెందిన అల్లకోడ్ ప్రశాంత్‌రెడ్డి పదేళ్ల క్రితమే(ఆమె బతికుండగానే) చనిపోయినట్లు పంచాయతీ కార్యాలయం నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. 2024 జనవరిలో కమలమ్మ చనిపోగా.. మూడు నెలల తర్వాత అదే డెత్ సర్టిఫికెట్ పెట్టి తాను ఆమె వారసుడనని కమలమ్మ పేరిట ఉన్న భూమిని తన పేరున మార్చాలని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. అప్పటి తహసీల్దార్.. దరఖాస్తుదారు ప్రశాంత్‌రెడ్డిపై పట్టా మార్పు చేశారు. ఇదిలా ఉండగా సీలింగ్ యాక్ట్ కింద భూమి కోల్పోయిన కరణం నర్సింగ్ రావు కుమారుడు కరణం రామారావుకు విషయం తెలియడంతో రెవెన్యూ అధికారులను నిలదీశారు. అనాథ దళిత మహిళ పేరిట ఉన్న భూమిని ఉన్నత వర్గానికి చెందిన ప్రశాంత్‌రెడ్డి పేరిట పట్టా మార్పు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో రెవెన్యూ అధికారుల అవినీతి లీలలు వెలుగు చూశాయి. ఈ విషయమై ఇన్‌చార్జ్ తహసీల్దార్ రుక్సానను వివరణ కోరగా.. తాను అప్పుడు ఇక్కడ విధుల్లో లేనని, తనకు ఎలాంటి సంబంధం తేదని తెలిపారు.
పదేళ్ల క్రితమే భూ ఆక్రమణకు ప్లాన్
ఒంటరి వృద్ధురాలు బతికుండగానే నకిలీ డెత్ సర్టిఫికెట్
చనిపోయాక అసైన్డ్ భూమిపట్టా మార్పు
నావంద్గీ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి..
అనాథ కావడంతో అధికారులతో కలిసి భూమిని కాజేసిన గ్రామస్తుడు
సామాజిక మాధ్యమాల్లో వైరల్


