అక్రమ కట్టడాలపై చర్యలకు వినతి
మీర్‌పేట: బడంగ్‌పేట సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టకు ఆనుకుని కొనసాగుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి కావడం, వంద ఫీట్ల రోడ్డు ఫుట్‌పాత్, కట్టను ధ్వంసం ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తాము గతంలోనే మీర్‌పేట కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, అయితే ఇది జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండడంతో వారు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం మీర్‌పేటను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి బడంగ్‌పేట సర్కిల్‌లో చేర్చారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఇదే విషయమై గురువారం మాజీ కార్పొరేటర్ గజ్జెల రాంచందర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వరరావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


