ఇదేం జాబితా?
రాజకీయ పార్టీలసమావేశం రసాభాస అధికారుల తీరుపై నాయకుల ఆగ్రహం
తాండూరు టౌన్: ముసాయిదా ఓటరు లిస్టుపై పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వార్డులోని ఓట్లు మరో వార్డులోకి రావడం, సరిహద్దులు లేకుండా ఓటర్లను వార్డుల్లో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల విడుదల చేసిన 36 వార్డుల ఓటరు లిస్టుపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం రసాభాసాగా మారింది.
అధికారుల తీరుపై మండిపాటు
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. 4వ వార్డు ఓటరు లిస్టులో భార్య పేరు, 5వ వార్డులో భర్త పేరు ఉండటాన్ని తప్పు బట్టారు. ఒక్కో వార్డులో 1,800ల ఓటర్లకు మించి ఉండరాదనే నిబంధనను అధికారులు తుంగలో తొక్కి, ఒక్కో వార్డులో 2వేలకు పైగా ఓటర్లను నమోదు చేశారని దుయ్యబట్టారు. 8వ వార్డు రాజీవ్ కాలనీలో ఏకంగా 1,524 ఓట్లు అదనంగా చేర్చారని, వీరంతా చుట్టు పక్కల గ్రామాల్లో నివసించే వారి పేర్లు ఉన్నాయని ఆరోపించారు. మృతి చెందిన వారి ఓట్లు తొలగించలేదన్నారు. ఓటరు లిస్టు పూర్తి తప్పుల తడకగా రూపొందించారని, వెంటనే సరి చేయాలన్నారు.
ముసాయిదా ఓటర్ లిస్టుపై తీవ్ర అభ్యంతరాలు
మార్పులు, చేర్పులు ఉండవు
నాయకులు చేసిన అభ్యంతరాలను స్వీకరించామని, అయితే ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులకు అవకాశం లేదని మున్సిపల్ కమిషనర్ యాదగిరి స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, టీజెఎస్, డబ్ల్యూపీఐ, బీఎస్పీ తదితరల పార్టీల నాయకులు మల్లేశం, భద్రేశ్వర్, శ్రీలత, రజినీకాంత్, హాది, కమాల్ అత ర్, విజయలక్ష్మి పండిట్, సోమశేఖర్, నర్సింలు, నీరజా, ప్రభాకర్‌గౌడ్, హబీబ్‌లాలా, శోభారాణి, శ్రీనివాసాచారి, ఆసిఫ్, సలీం తదితరులు పాల్గొన్నారు.


