కందికి గొడ్డుకాలం
కంది సాగు ఇలా..
పంటను ఆశించిన గొడ్డు మోత, ఎండు తెగుళ్లు
బషీరాబాద్: తాండూరు నియోజకవర్గంలో కంది పంట తెగుళ్ల బారిన పడింది. అధిక వర్షాలు, పంట మార్పిడి చేయకపోవడంతో గొడ్డు, ఎండు తెగుళ్లు ఆశించి పూత కాతకు నోచుకోక మోడుబారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఫలితం ఉండదని, పంటను కాపాడలేమని శాస్త్రవేత్తలు చెప్పడంతో కంది రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల్లో ఖరీఫ్ సీజన్‌లో 36,993 ఎకరాల్లో 18,233 మంది రైతులు కంది పంట వేశారు. 145 రోజుల్లో పంట చేతికి రావాల్సి ఉండగా అధిక వర్షాలు కురువడంతో పొలాల్లో నీళ్లు నిలిచి ఊటుబట్టి పోయాయి. ఏటా పంట మార్పిడి, విత్తన శుద్ధి చేయక పోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
కత్తి రకం ‘కంది’పోయే
బషీరాబాద్ మండలంలో 8,433 ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. అధిక వర్షాలకు 500 ఎకరాల్లో పొలాలు ఊటుపట్టి పంట దెబ్బతింది. 5వేల ఎకరాల్లో కత్తి రకం, 3,433 ఎకరాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఆశ, పీజేఆర్ 39 రకం విత్తనం వేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన విత్తనం కొంత మేర తెగుళ్లను ఎదుర్కొన్నట్లు రైతులు తెలిపారు. కత్తి రకం పంటకు గొడ్డు రోగం రావడంతో మొత్తానికి దెబ్బతింది.
తెగులు సోకడంతోనే..
అధిక వర్షాల కారణంగా కంది పంట దెబ్బతింది. రైతులు వేసవిలో ఎండ దుక్కులు, పంట మార్పిడి, విత్తన శుద్ధి చేయకపోవడంతో ఎండు, గొడ్డు మోతు తెగళ్లు పోకాయి. శాస్త్రవేత్తలు పంటను పరిశీలించే నాటికే పరిస్థితి చేయిదాటి పోయింది. పంటను కాపాడలేమని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిస్తాం.
– కొమురయ్య, ఏడీఏ, తాండూరు
ప్రభుత్వం ఆదుకోవాలి
ఆరు ఎకరాల సొంత పొలం, 12 ఎకరాలు కౌలుకు తీసుకొని కత్తి, ఆశ రకం కంది పంట సాగు చేశా. ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టా. కత్తి రకం ఏపుగా పెరిగినా పూత, కాత రాలేదు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించలేదు. పూర్తిగా నష్టపోయా. ప్రభుత్వం ఆదుకోవాలి.
– దుశ్యంత్‌రెడ్డి, కంది రైతు
మండలం సాగు విస్తీర్ణం ఎకరాల్లో..
తాండూరు 15,373
పెద్దేముల్ 9,044
బషీరాబాద్ 8,433
యాలాల 4,143
మొత్తం 36,933
కందికి గొడ్డుకాలం
కందికి గొడ్డుకాలం


