దుద్యాల్.. రేడియల్
శంషాబాద్ నుంచి మండలం మీదుగా రేడియల్ రోడ్డు హకీంపేట్, లగచర్ల వరకు కలపాలనే నిర్ణయం డీపీఆర్ సిద్ధం చేస్తున్న అధికారులు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న రహదారి
దుద్యాల్: మండలంలో రహదారి వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నా యి. మండలం మీదుగా రేడియల్ రోడ్డు నిర్మించా లని ప్రభుత్వం భావిస్తోంది. హకీంపేట్‌లో ఎడ్యుకేషన్ హబ్, లగచర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటు పనులు చకచకా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. విద్యాలయాల పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో పరిశ్రమలు ఏర్పాటు చేసే పనులు మొద లు కానున్నాయి. ఈ క్రమంలో రహదారి, రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మండలం మీదుగా రేడియల్ రోడ్డు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం 1,175.36 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసి 1,100 ఎకరాలను రైతులకు పరిహారం చెల్లించి తీసుకుంది. కొంత మంది రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో జనరల్ అవార్డు ప్రకటించి పరిహారం మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసింది. ఈ క్రమంలో నగరం నుంచి లగచర్ల, హకీంపేట్‌కు రాకపోకలు, రవాణా సౌకర్యం సులువుగా ఉండాలనే ఉద్దేశంతో రేడియల్ రోడ్డు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
80కిలో మీటర్ల మేర..
శంషాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా అమనగల్లు.. వికారాబాద్ జిల్లా పరిగి, దోమ మండలాల మీదుగా దుద్యాల్ మండలం హకీంపేట్, లగచర్ల గ్రామాలను కలుపుతూ నారాయణపేట్ జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 167కు రేడియల్ రోడ్డును అనుసంధానం చేసేలా అధికారులు డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు దాదాపు 80 కిలో మీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు.
పరిగి, కొడంగల్‌కు ఎంతో మేలు
రేడియల్ రోడ్డు అందుబాటులోకి వస్తే జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన పరిగి, కొడంగల్‌కు.. అలాగే నారాయణపేట్ జిల్లాలోని కోస్గి మండలానికి ఎంతో మేలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పలువురు భావిస్తున్నారు. కొడంగల్ మండలం టేకుల్‌కోడ్ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉండటంతో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రేడియల్ రోడ్డు కారణంగా భూముల ధరలు భారీ పెరుగుతాయని రైతులు భావిస్తున్నారు. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశంఉందంటున్నారు.
మారిన ప్రతిపాదనలు
మొదట్లో రేడియల్ రోడ్డును దుద్యాల్ మండలంలోని హకీంపేట్, నారాయణపేట్ జిల్లా కోస్గి మండ లం తొగపూర్ వరకు వేసేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. హకీంపేట్‌లో ఎడ్యుకేషన్ హబ్.. లగచర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆ రెండు గ్రామాల మీదుగా రోడ్డు వేస్తే ప్ర యోజనం ఉంటుందని టీజీఐఐసీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే డీపీఆర్‌ను మార్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి తే దుద్యాల్ మండలం దేశంలోనే పెద్ద పారిశ్రామిక మండలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
300 అడుగుల వెడల్పుతో..
300 అడుగుల వెడల్పుతో రేడియల్ రోడ్డు నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వైపులా కలిపి 10 లేన్లు నిర్మిస్తారు. ఇందుకు గాను భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. 80 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి దాదాపు 1,800 ఎకరాల వరకు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పరిశ్రమల ఏర్పాటు కోసం సిద్ధం చేసిన భూమి
పారిశ్రామిక వాడకు యంత్రాలు
దుద్యాల్.. రేడియల్
దుద్యాల్.. రేడియల్


