ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
కొడంగల్: ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్, ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ప్రాణం చాలా విలువైనదని పోతే తిరిగి రాదన్నారు. కుటుంబాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, సీట్ బెల్టు ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోతే కుటుంబ సభ్యులు రోడ్డున పడతారని అన్నారు. అతివేగంగా వాహనాలను నడిపి ఇతరుల మరణానికి కారకులు కావొద్దని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. ట్రిఫిక్ రూల్స్ పాటిస్తామని తల్లిదండ్రులు, బంధువులుతో విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, డీఎస్పీ శ్రీనివాస్, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌వీరేంద్ర నాయక్, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐలు సత్యనారాయణ, వెంకటరమణ, శ్రీశైలం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


